Mon Dec 23 2024 03:11:54 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus : టిక్కెట్లు తక్కువ... బస్సులు నిండుగా.. హెవీ రష్ తో ఆర్టీసీ బస్సులు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నెల 9 నుంచి మహాలక్ష్మి పధకం కింద ఈ పథకాన్ని ప్రారంభించింది.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పధకం కింద ఈ పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులు మహిళ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆటోలను ఆశ్రయించకుండా ఉచితంగా బస్సుల్లోనే ప్రయాణాన్ని ఎంచుకోవడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. బస్సులన్నీ కిటికటలాడిపోతున్నాయి.
మహిళ ప్రయాణికులతో....
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు మహిళ ప్రయాణఇకులతో నిండిపోతున్నాయి. నగరంలో ఎక్కడకు వెళ్లాలన్నా మహిళలు ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. గతంలో మెట్రో, ఆటోలలో వెళ్లేవారు సయితం ఇప్పుడు బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండటంతో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ప్రయాణికుల సంఖ్య పదిహేను శాతం పెరిగిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. యువతులు తమ పనుల నిమిత్తం బయటకు వెళ్లాలన్నా, ఉద్యోగాలకు తాము పనిచేసే చోటకు చేరుకోవాలన్నా బస్సులనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ.....
దీంతో టిక్కెట్లు తక్కువ.. బస్సు నిండుగా అన్నట్లు తయారైంది. మొదటి వారం రోజులు ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం కూడా లేకపోవడంతో మహిళలు బస్సు ఎక్కిన వారిని ఎక్కినట్లుగా ఆర్టీసీ బస్సులు గమ్యస్థానానికి చేరవేస్తున్నాయి. సురక్షితమైన ప్రయాణం కావడంతో మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల వైపే ఎక్కువగా చూస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఏ చిన్న పనికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సుల కోసం మహిళలు బస్టాండ్లలో వేచి చూస్తున్న పరిస్థిితి అనేక చోట్ల కనిపిస్తుంది. దీంతో మహిళలతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆదాయం లేకున్నా బస్సులన్నీ ప్రయాణికులతో కళకళలాడిపోతుండటం ఒకరకంగా సంతోషం.. ఆదాయం పరంగా మాత్రం బాధాకరమే.
Next Story