Sun Dec 15 2024 12:25:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఈ సారి శుక్రవారం అరెస్ట్ అయ్యేది ఆయనేనా? అంతా రెడీ అవుతుందా?
శుక్రవారం అంటే.. అరెస్ట్ లు పర్వం కొనసాగుతుంది. కూల్చివేతలు ప్రారంభమవుతాయి
శుక్రవారం అంటే.. అరెస్ట్ లు పర్వం కొనసాగుతుంది. కూల్చివేతలు ప్రారంభమవుతాయి. అంటే శని, ఆదివారాలు న్యాయస్థానాలకు సెలవు దినాలు కావడంతో ఈ రోజుల్లోనే ఎక్కువగా తమ పని ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. పోలీసులు అరెస్ట్ ల విషయంలోనూ, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతల విషయంలో శుక్రవారం వస్తే రెడీ అయిపోతుంటారు. ఇది ఎక్కడైనా జరిగేదే. అందుకే శుక్రవారం వస్తుందంటే ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న ఆందోళన కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతలకు ఫ్రైడేఫీవర్ మాత్రం వీడటం లేదు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అరెస్టయింది శుక్రవారమే కావడంతో వచ్చే శుక్రవారం అరెస్ట్ అయ్యేదెవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
టీజర్ చూపించారట...
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ టీజర్ మాత్రమేనని అంటున్నారు. ముందుంది అసలు సినిమా అని చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతిచ్చారన్నవార్తలు బీఆర్ఎస్ నేతల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేశారంటే ఇక మిగిలిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమన్న సంకేతాలను పోలీసులు బలంగా పంపించారంటున్నారు. నిజానికి అల్లుఅర్జున్ అరెస్ట్ పై అనుకున్న స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మహిళ మృతికి కారణమైన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో తప్పేమిటన్న ప్రశ్న అనేక వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేసినా పెద్ద వ్యతిరేకత రాదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది.
ఫార్ములా ఈ రేస్ కు...
ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి 46 కోట్ల హెచ్ఎండీఏ నిధులను విడతల వారీగా అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ విడుదల చేశారన్న దానిపై ఎఫ్ఐర్ నమోదు చేయడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని ఇప్పటికే ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడంతో ఇక వేగంగా తమ పనిని మొదలు పెట్టారని అంటున్నారు. అయితే ప్రజల నుంచి సానుభూతితో పాటు వ్యతిరేకత రాకుండా ఉండేలా ఆచితూచి అధికారులు అడుగులు వేస్తున్నారు.మొత్తం మీద అల్లు అర్జున్ తర్వాత అరెస్ట్ అయ్యేది కేటీఆర్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది.
Next Story