Tue Jan 07 2025 02:25:36 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సంక్రాంతి సినిమా రేట్లు పెంచారో.. పెరిగిన కాస్త పరపతి కూడా పడిపోతుందిగా?
తెలంగాణలో ఇప్పటి వరకూ సంక్రాంతి సినిమాలకు సంబంధించి టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
ఆంధ్రప్రదేశ్ లో సినిమా ధరలను పెంచేశారు. సంక్రాంతి పండగకు విడుదలయ్యే సినిమాలకు అధిక ధరలకు విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. రోజుకు ఐదు షోలకు కూడా అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సంథ్య థియేటర్ జరిగిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ను దూరం చేసుకోలేక ఈరకమైన నిర్ణయం తీసుకుందన్న విమర్శలు సోషల్ మీడియాలో బహిరంగంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ సంఘటన ఏపీలో జరగకపోవడంతో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తుందనుకోవాలి. అలాగే హీరోలు, సినీ నటులు థియేటర్లకు రాకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశముంది. ఒక్కొక్క టిక్కెట్ ధరను ఆరువందల రూపాయల వరకూ పెంచారు.
నిర్ణయం తీసుకోకపోయినా...
అయితే తెలంగాణలో ఇప్పటి వరకూ సంక్రాంతి సినిమాలకు సంబంధించి టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 10వ తేదీన గేమ్ ఛేంజర్ విడుదల కానుండటంతో పాటు బాలకృష్ణ సినిమా డాకూ మహారాజ్, వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు టిక్కెట్ల ధరలను పెంచాలని నిర్మాతలు సహజంగా కోరే అవకాశముంది. ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి టిక్కెట్ల ధరల పెంపు, అదనపు షోలకు అనుమతులపై చర్చించినట్లు చెబుతున్నారు. అయితే నిర్ణయం మాత్రం ఇంకా బయటకు వెల్లడి కాలేదు.
అనుమతిస్తే మాత్రం...
ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి మంజూరు చేస్తే మాత్రం మొన్న పెరిగిన పరపతి మాత్రం దిగజారే అవకాశముంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ తో కొంత ఇమేజ్ పెంచుకున్న తెలంగాణ సర్కార్ తిరిగి అదే తప్పును చేస్తే మాత్రం ప్రజలు ఓస్ ఇంతేనా? అన్న రీతిలో పెదవి విరుస్తారన్నది గ్యారంటీ. ఇటీవల టాలీవుడ్ పెద్దలతో జరిగిన సమావేశంలోనూ టిక్కెట్ల ధరల పెంపుదల, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే కేవలం దిల్ రాజు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను ఎదుర్కొనక తప్పదు. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై కామెంట్స్ కనపడుతున్నాయి. ఏపీలో ధరలు పెంచడంతో ఇక్కడ కూడా ధరలు పెంచాలని నిర్మాతలు కోరుతున్నారు. మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తుందన్నది వేచి చూడాల్సిందే.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story