Mon Mar 31 2025 03:25:01 GMT+0000 (Coordinated Universal Time)
Caste Census Survey : కులగణన సర్వేకు మరో రెండు రోజులే గడువు... ఇంకా పాల్గొనని వారు ఎంతమంది అంటే?
తెలంగాణలో కులగణన సర్వే మరోసారి ప్రభుత్వం ప్రారంభించింది

తెలంగాణలో కులగణన సర్వే మరోసారి ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో జరిగిన సర్వేలో పాల్గొనని వారి కోసం మరొక సారి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో సర్వే చేసినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 3.56 లక్షల కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయి. వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఈనెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ రీ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సర్వేలో అందరూ పాల్గొనాలని కోరింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ మంది దూరంగా ఉండటంతో పాటు కొన్నిఇళ్లకు ఎన్యుమరేటర్లు వెళ్లినప్పుడు తాళాలు వేసి ఉండటంతో మరోసారి సర్వే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు 16వ తేదీ నుంచి సర్వే ప్రారంభమయింది.
హైదరాబాద్ నగరంలోనే...
అయితే ఈ సర్వేలో కూడా ఆశించినంత మంది పాల్గొనడం లేదని తెలుస్తోంది. 3.56 లక్షల కుటుంబాలకు యాభై ఆరు వేల కుటుంబాల సర్వే కూడా పూర్తి కాలేదని సమాచారం. తమ ఆస్తుల వివరాలను చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. ఈసారి సర్వేలోనూ హైదరాబాద్ లోనే ఎక్కువ మంది సర్వే పట్ల విముఖత చూపుతున్నారు. తమ వివరాలను అందించేందుకు ఇష్టపడటం లేదు. అన్ని వివరాలను అందించడానికి తమ కుటుంబ పెద్ద ఇంట్లో లేరని కొందరు, తమకు ఆస్తుల విషయాలు తెలియవని మరికొందరు సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. బీసీల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన ఈ కులగణన సర్వేకు ఆశించినంత రెస్పాన్స్ రావడం లేదని చెబుతున్నారు.
టోల్ ఫ్రీ నెంబరుకు...
తమ ఇళ్లకు ఎన్యుమరేటర్లు రాకపోతే టోల్ ఫ్రీ నెంబరు కు కాల్ చేయాలని కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరుకు కేవలం ఆరువేల ఫోన్ కాల్స్ మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వివరాలు చెప్పినందున తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుందని భావించి అనేక మంది సర్వేకు దూరంగా ఉంటున్నారని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. దీంతో పాటు యాభైకి పైగా ప్రశ్నలు ఉండటంతో వారు వివరాలు చెప్పేందుకు విముఖత చూపుతున్నారు. ఈ నెల 28వ తేదీతో సర్వే ముగియనుంది. అంటే మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో పూర్తిస్థాయి సర్వే జరగడం కష్టమేనని అధికారులు అంగీకరిస్తున్నారు.
Next Story