Tue Mar 18 2025 14:24:17 GMT+0000 (Coordinated Universal Time)
నవీన్ హత్య పై నిందితుడి తండ్రి వివరణ ఇదీ..
ఇటీవలే తన కొడుకుతో పాటు మరికొంతమంది ఓ రూమ్ రెంట్ కు తీసుకున్నారని, ఆ రూమ్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని..

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్యపై.. నిందితుడు హరిహరకృష్ణ తండ్రి స్పందించారు. నవీన్ హత్య మద్యంమత్తులో జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ హత్య తన కొడుకు ఒక్కడే చేసి ఉంటాడని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. నవీన్ హత్య వెనుక తన కొడుకుతోపాటు మరికొంతమంది ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు.
నవీన్ హత్యకు కారణమైన ఆ యువతిని కూడా పోలీసులు విచారణ చేస్తే.. మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఇటీవలే తన కొడుకుతో పాటు మరికొంతమంది ఓ రూమ్ రెంట్ కు తీసుకున్నారని, ఆ రూమ్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని పోలీసులు వారిని ప్రశ్నిస్తే అసలు నిజాలేంటో తెలుస్తాయన్నారు. తన కొడుకు హరిహరకృష్ణ బాగా చదివేవాడని, పదో తరగతిలో స్కూలు ఫస్ట్ వచ్చాడని ఆయన చెప్పారు. గతంలో ఎన్నడూ ఎవరిపైనా చేయి చేసుకున్న సందర్భాలు లేవని, అలాంటి వ్యక్తి సైకో అంటే ఎవరూ నమ్మరని తెలిపారు.
తాను 30 ఏళ్లుగా ఆర్ఎంపీ గా చేస్తున్నానన్న హరి తండ్రి.. ఒక సైకో ప్రవర్తన ఎలా ఉంటుందో అవగాహన ఉందన్నారు. హత్య విషయం తెలిశాక తానే తన కొడుకుని పోలీసులకు లొంగిపోవాలని చెప్పినట్లు ఆయన వివరించారు. నవీన్ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణకు ఎలాంటి శిక్ష విధించాలో న్యాయస్థానమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
Next Story