అతి భారీ వర్షాలు ముంచుకొస్తున్నాయ్..!
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు. హైదరాబాద్లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.