Sun Dec 22 2024 21:36:31 GMT+0000 (Coordinated Universal Time)
Temparatures : వడదెబ్బ.. మామూలుగా లేదుగా.. ఆసుపత్రులన్నీ కిటకిట
తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంది.
తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంది. భానుడి ఉగ్రరూపంతో ప్రజలు వణికిపోతున్నారు. అనేక మంది వడదెబ్బ తగిలి ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే వేడి గాలులు వస్తుండటంతో ప్రజలు ఇంట్లో ఉన్నా, బయటకు వచ్చినా వడ దెబ్బ తగిలి ఆసుపత్రులకు చేరే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అనేక ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో చిన్నారులు, వృద్ధులు వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు.
డీహైడ్రేషన్ కు గురై...
ఆసుపత్రులకు చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. డీహైడ్రేషన్ కు గురవ్వడమే కాకుండా తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గత నాలుగైదు రోజుల నుంచి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆసుపత్రులన్నీ ఉదయం నుంచే కిటికిటలాడుతున్నాయి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తొమ్మిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది కూడా.
గరిష్ట స్థాయికి....
ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని జిల్లాల్లో నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడగాలుల నుంచి కాపాడుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story