Fri Nov 15 2024 09:46:39 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తాం
తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తాము అధికారం లోకి రాగానే అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు
తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పండే ధాన్యాన్ని మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఓటు రాష్ట్ర భవిష్యత్ తో పాటు దేశ భవిష్యత్ ను కూడా నిర్ణయిస్తుందన్నారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోయిందో ఆలోచించాలని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీని కూడా గత ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు. నిరుద్యోగ భృతిని ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు
డబుల్ ఇంజిన్ సర్కార్...
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్మామని అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తామని అమిత్ షా తెలిపారు. తాము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండూ అవినీతి పార్టీలేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కు ఒక్కసారి అవకాశమివ్వాలని ఆయన కోరారు. తాము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తామని తెలిపారు.
దివాలా తీసిన...
గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలన్నింటినీ ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ నెరవేర్చిందన్న అమిత్ షా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, తాము ఖచ్చితంగా కరప్షన్ పై విచారణ జరుపుతామని ఆయన అన్నారు. అవినీతి తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణకు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణ దివాలా తీసిందని, దానిని గాడిలో పెట్టేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అమిత్ షా కోరారు.
Next Story