Mon Dec 23 2024 05:27:12 GMT+0000 (Coordinated Universal Time)
T Square: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో.. హైదరాబాద్ లో 'టి-స్క్వేర్'
న్యూయార్క్ లో ఫేమస్ అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలో టి-స్క్వేర్ ఉండబోతోంది
హైదరాబాద్ అంటే ఛార్మినార్, గోల్కొండ ఫోర్ట్, బుద్ధుడి విగ్రహం మాత్రమే కాదు.. ఇకపై అమెరికాలోని న్యూయార్క్ లో ఫేమస్ అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలో టి-స్క్వేర్ ఉండబోతోంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ లాగా ఐకానిక్‌గా మన దగ్గర కూడా కనిపించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) రాయదుర్గంలో నెలకొల్పనున్న టి-స్క్వేర్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఆర్కిటెక్చరల్, లావాదేవీల సలహా సేవల కోసం టెండర్లు జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియను మొదలుపెట్టింది.
ఈ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన కట్టడం, మల్టీఫంక్షనల్ ప్లాజా అవసరం ఉందంటూ TGIIC హైలైట్ చేసింది. ఇక్కడి కమ్యూనిటీకి సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కట్టడం ఉండాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఐటీకి హైదరాబాద్ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు హైదరాబాద్ లో టి-స్క్వేర్ ను ఫేమస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
T-స్క్వేర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాయదుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఎన్నో అధునాతనమైన సదుపాయాలను ఇక్కడకు తీసుకుని రావడమే కాకుండా, సమస్యల పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. TGRTC, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా జరుగుతున్న ప్రజా రవాణాకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ.. ఇంకా ఎక్కడో కొన్ని లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. T-స్క్వేర్ ను కమ్యూనికేషన్, రిలాక్సేషన్, సెలెబ్రేషన్స్ కు వేదికగా మార్చాలని అనుకుంటూ ఉన్నారు. ఈ ప్లాజా కమ్యూనిటీ కోసం ఉత్సాహభరితమైన, వైవిధ్యభరితమైన వాతావరణాన్ని అందించగలదు. మ్యూజిక్, ఆర్టిస్టిక్ వర్క్.. ఇలా ఎన్నో రకాల ఈవెంట్లను నిర్వహించవచ్చు. ఈ ప్రాజెక్ట్ పట్టణ వాతావరణాన్ని మరింత మెరుగుపరచడమే కాకుండా.. టూరిజానికి కూడా వేదికగా నిలవనుంది.
Next Story