"నా మాట నిలబెట్టుకున్నా" : కేసీఆర్
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన రంగుల వేడుకలో సీఎం గౌరవ వందనం స్వీకరించారు. సుమారు 15,000 మంది హాజరైన ఈ వేడుక రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల వేడుకలకు నాంది పలికింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి గురించి వివరించారు. మిషన్ భగీరథ ద్వారా వందకు వంద శాతం ఇళ్లకు నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న.. దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన నీటిని, బిందెడు నీళ్ల కోసం మహిళలు పడే కష్టాలను నివారించకుంటే తాను ప్రజలను ఓట్లు అడగనని రాష్ట్రం ఏర్పడ్డ మొదట్లోనే ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. ప్రతీ ఇంటీకి స్వచ్ఛమైన తాగునీరు అందుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే పెద్ద రాష్ట్రాల్లో వెస్ట్‌బెంగాల్ అట్టడుగు స్థానంలో ఉండగా.. గుజరాత్ మూడో స్థానంలో ఉందన్నారు. మిషన్ భగీరథను కేంద్ర ప్రభుత్వం అనుకరించిందన్నారు.
'హర్ ఘర్ జల్ యోజన' అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తోందన్నారు. అయితే అది ఇప్పటికీ వంద శాతం లక్ష్యాన్ని చేరుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ నీటిపై కేంద్ర జలశక్తి పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ పరీక్షలు చేసిందని, 99.95 శాతం నల్లా నీళ్లలో కలుషిత కారకాలు లేవని నిర్ధారించిందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. మిషన్ భగీరథకు నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్‌తో పాటు అవార్డులు, ప్రశంసలు దక్కాయన్నారు. గతంలో నీళ్ల కోసం ఖాళీ బిందెలతో ప్రజలు ధర్నాలు చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా నీళ్లు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.