'ప్రజాపాలన' కు గల్ఫ్ మృతుల కుటుంబాలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా... 'అభయ హస్తం మేనిఫెస్టో' లో 'గల్ఫ్ కార్మికులు ఎన్నారైల సంక్షేమం' పై నాలుగు హామీలు ఇచ్చారు.
◉ 'అభయహస్తం' గల్ఫ్ హామీల అమలుకు విజ్ఞప్తి
◉ గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా... 'అభయ హస్తం మేనిఫెస్టో' లో 'గల్ఫ్ కార్మికులు ఎన్నారైల సంక్షేమం' పై నాలుగు హామీలు ఇచ్చారు. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆరు గ్యారంటీల అమలు కోసం ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు 'ప్రజాపాలన' నిర్వహించి గ్రామ సభలు, పట్టణాలలో వార్డు సభల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో... గల్ఫ్ మృతుల కుటుంబాలు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా కొరకు 'ప్రజాపాలన' లో దరఖాస్తులు ఇవ్వాలని గల్ఫ్ జెఏసి పిలుపు ఇచ్చిందని భీంరెడ్డి తెలిపారు.
ఎన్నారైలకు సంక్షేమ బోర్డు, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని గల్ఫ్ ఎన్నారైలకు కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.