Sat Nov 23 2024 02:22:59 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నాలుగేళ్లు హ్యాపీనే... అసలు కథ ముందుంది మావా? బీఫారం వచ్చే వరకూ డౌటే?
తెలంగాణాలో గతంలో సీన్ రిపీట్ అవుతుంది. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి వెళుతున్నారు
తెలంగాణాలో గతంలో సీన్ రిపీట్ అవుతుంది. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య పెరగడం బలం పరంగా కాంగ్రెస్ కు అవసరం. గత బీఆర్ఎస్ హయాంలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇతర పార్టీల నుంచి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ పార్టీనీ కేసీఆర్ వదలలేదు. చివరకు కమ్యునిస్టు ఎమ్మెల్యేలను కూడా తనలో కలేపేసుకుని దురాశకు తెరదీశారు. అలాంటీ కేసీఆర్ చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో సాంకేతికంగా పక్కన పెడితే మామూలుగా అయితే తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే తమ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుంది.
వచ్చే ఎన్నికల్లో....
కానీ పార్టీ మారుతున్న వారికి ఈ నాలుగేళ్లు హ్యాపీగానే ఉండొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. అధికార పార్టీ కావడంతో ఎంతో కొంత వెనకేసుకోవడానికి, తాము పెత్తనం చెలాయించడానికి మాత్రమే ఈ నాలుగేళ్లు ఉపయోగపడుతుంది. అయితే అసలు సమస్య నాలుగేళ్లు తర్వాత ఎదురవుతుంది. కానీ నాలుగేళ్లు తర్వాత ఎదురయ్యే సమస్యలను మాత్రం పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు గుర్తించడం లేదు. అలాగే ఎమ్మెల్సీలు కూడా. ఇప్పుడు బాగానే ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికలే వీరికి ప్రధాన సమస్యా మారనుంది. కాంగ్రెస్ మరొకసారి అధికారంలోకి రావచ్చు. రాకపోవచ్చు. అలాగే బీఆర్ఎస్ కూడా అంతే.
విధేయత.. విశ్వాసంతో....
కానీ అసలు సమస్య వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ సాధించుకోవడం అంటే.... కాంగ్రెస్ లో చేయాల్సిన ఫీట్లు మామూలుగా ఉండవు. బీఫారం వచ్చేంత వరకూ టెన్షన్ పడక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో అందరం చూశాం. విడతల వారీగా కాంగ్రెస్ జాబితాను రిలీజ్ చేసింది. సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ టిక్కెట్లను సర్వేల ఆధారంగా టిక్కెట్లు ను కేటాయించింది. ఇక బీఆర్ఎస్ లో మాదిరి ఒకరి చేతిలో టిక్కెట్లు ఖరారు అనేది ఉండదు. కారు పార్టీలో అయితే కేసీఆర్, కేటీఆర్, కవితతో లాబీయింగ్ చేయిస్తే కొంత టిక్కెట్ దొరుకుతుందన్న నమ్మకం ఉంటుంది. గత ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ మారి వచ్చిన దాదాపు అందరికి దాదాపు టిక్కెట్లు ఇచ్చారు. బీఫారాలతో పాటు పార్టీ నిధుల చెక్కు కూడా ఇచ్చారు. జాబితాను దాదాపు ఒకేసారి ఇచ్చారు. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చినా వారిలో ఎక్కువ మంది ఓటమి పాలయ్యారు.
అసంతృప్తులు కూడా...
అయితే కాంగ్రెస్ లో అలా కాదు. ఇప్పుడు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల పెంపు జరుగుతుందని భావించి వేగంగా జెండాను మార్చేస్తున్నారు. అయితే రిజర్వ్డ్ నియోజకవర్గాలన్నీ ఈసారి మారిపోతాయి. అలాగే కొన్ని జనరల్ నియోజకవర్గాలు రిజర్వ్డ్ గా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానంలో 153 స్థానాలకు పెరగనున్నాయి. అంటే దాదాపు 34 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. కానీ కాంగ్రెస్ లో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకంటే పార్టీని నమ్ముకున్న నేతలకే ప్రాధాన్యత ఉంటుంది. సామాజికవర్గాల సమతుల్యం చూస్తుంది. టిక్కెట్ దక్కించుకోవడం అంటే గెలవడానికి మించి కష్టపడాలి. అసమ్మతి, అసంతృప్తులు నేరుగానే రియాక్ట్ అవుతారు. అందుకే ఇప్పుడు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు టిక్కెట్ కోసం వచ్చే ఎన్నికల నాటికి ఎంత టెన్షన్ పడాలో గుర్తుంచుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఎమ్మెల్సీలు కూడా తమ పదవీ కాలం పూర్తి అయితే తిరిగి వారికే దక్కుతుందన్న గ్యారంటీ లేదు. సో.. పార్టీ మారే ఎమ్మెల్యేలు ఇవన్నీ ఆలోచించుకుని మారితే బెటర్ అన్న సూచనలు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Next Story