Mon Dec 23 2024 09:34:45 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : తెలంగాణకు రెండు రోజుల భారీ వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన, దాని ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నగర వాసుల కష్టాలు...
ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రతి రోజూ సాయంత్రం వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. మరో రెండు రోజులు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు వరసగా కురుస్తుండటంతో కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పాటు చిరు వ్యాపారులకు కూడా అకాల వర్షం ఇబ్బందిగా మారింది. వ్యాపారాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నామంటున్నారు. ఉద్యోగులు కూడా విధులకు వెళ్లి ఇళ్లకు చేరుకోవాలంటే కష్టంగా మారిందని వాపోతున్నారు. హైదరాబాద్ నగరం చినుకుపడితే చాలు ఇక ముందుకు కదలలేని పరిస్థితి నెలకొని ఉండటంతో అనేక మంది తమ వాహనాలతో గంటల తరబడి రోడ్డుమీదనే వెయిట్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
Next Story