Thu Apr 24 2025 12:08:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : దావోస్ లో దుమ్ము రేపిన రేవంత్ రెడ్డి టీం
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణలో పెట్టుబడులు వెల్లువెత్తాయి.

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 56,300 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ నుంచి వెళ్లిన రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులు తేవడంలో సక్సెస్ అయింది. భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చేలా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణకు చెందిన దాదాపు పదకొండు వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కొత్తగా లభించనున్నాయి. ఇందులో కేవలం సన్ పెట్రో కెమికల్స్ ఒప్పందమే 45,500 కోట్ల రూపాయల విలువైనది ఉంది. దేశంలోనే ఇంధన రంగంలో పేరు ప్రతిష్టలున్న ఈ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.
మూడు వెనకబడిన ప్రాంతాల్లో...
నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ పంప్ స్టోరేజీ, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సన్ పెట్రో కెమికల్స్ అంగీకరించింది. ఇది మంచి అవకాశమని ప్రభుత్వం భావిస్తుంది. మూడు ప్రాంతాల్లో మూడు పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలోనే దాదాపు ఏడు వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు రేవంత్ రెడ్డి బృందం తెలిపింది. వెనుకబడిన ప్రాంతాలైన మూడు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ అభివృద్ధి కూడా సత్వరం ఊపందుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ముందుగానే అక్కడకు చేరుకుని...
దావోస్ సదస్సుకు ముందుగానే స్విట్జర్లాండ్ కు చేరకున్న రేవంత్ రెడ్డి బృందం 3,500 కోట్ల మేరకు ఒప్పందాలను కుదుర్చుకుంది. వరసగా మూడు రోజుల పాటు వివిధ సంస్థల పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో సమావేశమై పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని వివరించడంలో రేవంత్ రెడ్డి టీం సక్సెస్ అయిందనే చెప్పాలి. గతంలోనూ ఎప్పుడూ లేని విధంగా ఇంతటి భారీ స్థాయిలో దావోస్ పర్యటన నుంచి పెట్టుబడులు తేవడం రికార్డు బ్రేక్ అని పరిశ్రమ వర్గాలు కూడా వెల్లడించాయి. తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డేటా సెంటర్ ను పది వేల కోట్ల రూపాయలతో నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ సంస్థ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలన్నీ అమలయితే యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు రావడమే కాకుండా, పరోక్షంగా ఉపాధి వేలాది మందికి లభించనుంది.
Next Story