Sun Dec 22 2024 17:26:22 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ వదులుతున్న మరో బాణం.. గుడ్ న్యూస్‌కు రెడీ అవ్వండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళికి భారీ గిఫ్ట్‌ను వెల్లడించనున్నారని సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళికి భారీ గిఫ్ట్‌ను వెల్లడించనున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన ఆర్థిక శాఖ అధికారులతో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. వరసగా తమ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తుండటంతో పాటు కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేయడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆర్థిక పరమైన ఇబ్బందులున్నప్పటికీ విమర్శలు, ప్రభుత్వం ప్రజల నుంచి కొంత సానుకూల స్పందన కోరుకోవడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. అది కూడా మహిళలను దృష్టిలో పెట్టుకుని ప్రకటన చేయనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.
మహాలక్ష్మి పథకం కింద...
మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకోసం కసరత్తులు ప్రారంభించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పేద మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకాన్ని దీపావళి బహుమతిగా ఇవ్వనున్నారని చెబుతున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడం కంటే ముందుగానే మహిళలకు సంబంధించి ఈ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మహిళలు తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తారని, అందుకే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు.
అర్హతలు ఉంటేనే?
రైతు భరోసా నిధులను కూడా రైతు రుణమాఫీ పూర్తి అయిన వెంటనే అమలు పర్చాలని నిర్ణయించారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇప్పటికే కొందరికి అమలు చేశారు. ఇంకా పెండింగ్ లో ఉన్న రుణాలను ఈ డిసెంబరు నాటికి మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తెల్ల రేషన్ కార్డులున్న మహిళలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తింప చేస్తారు. ఇప్పటికే సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారికి కూడా రావు. దీనికి సంబంధించిన కసరత్తులు అధికారులు చేస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరయితే వారికి తర్వాత ఇవ్వొచ్చని, ముందు తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారికి ఈ పథకాన్ని వర్తింప చేయాలని రేవంత్ అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. మరి రేవంత్ ఈ పథకాన్ని గ్రౌండ్ చేసే డేట్ మాత్రం బయటకు రాలేదు.
Next Story