Mon Dec 23 2024 11:54:07 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లల్లో ఐటీ సోదాలు
హిల్ ల్యాండ్ టెక్నాలజీస్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్, వైష్ణవి రియల్ ఎస్టేట్స్, ఎట్ హోమ్ హోటల్ తో పాటు జేసీ..
తెలంగాణలో బుధవారం ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో, వారికి సంబంధించిన వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏక కాలంలో సుమారు 60 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఎంపీ కొత్త ప్రభాకర్ ఇల్లు, ఆయనకు చెందిన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
హిల్ ల్యాండ్ టెక్నాలజీస్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్, వైష్ణవి రియల్ ఎస్టేట్స్, ఎట్ హోమ్ హోటల్ తో పాటు జేసీ బ్రదర్స్ మాల్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి భార్య వనిత హిల్ ల్యాండ్ టెక్నాలజీస్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ కు డైరెక్టర్ గా ఉన్నారు. కొత్తపేట, గ్రీన్ హిల్స్ కాలనీల్లో ఉన్న కార్యాలయాలతో పాటు భువనగిరిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి తీర్థ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు.
కర్ణాటకలో పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది. ఈ గ్రూప్ సౌతాఫ్రికాలోనూ మైనింగ్ వ్యాపారాలు చేస్తోంది. గ్రూప్ వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టిసారించారు. శేఖర్ రెడ్డి మామ మోహన్ రెడ్డి ఇంటిలోనూ సోదాలు జరుపుతున్నారు. మోహన్ రెడ్డి గతంలో భువనగిరి తహశీల్దార్ గా పనిచేశారు. ఆయన ఇంట్లో శేఖర్ రెడ్డికి చెందిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే మర్రి జనార్థన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ మాల్ లోనూ ఉదయం 6 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాలు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతుండటంతో.. ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది.
Next Story