Tue Apr 22 2025 15:45:35 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ ఒంటరి పోరు ఇంకా ఎన్నాళ్లు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటరి వాడయ్యాడని పిస్తుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటరి వాడయ్యాడని పిస్తుంది. ఆయనపై ముప్పేట దాడికి దిగుతున్నా మంత్రులు పెద్దగా రెస్పాండ్ కావడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మాజీ మంత్రి హరీశ్ రావు వరకూ నిత్యం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ నేతలు లైట్ గానే తీసుకుంటున్నారు. ప్రతి విమర్శకు ముఖ్యమంత్రి స్వయంగా తానే సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తానే కౌంటర్ ఇవ్వాల్సిన దుస్థితులు నెలకొన్నాయి. ప్రతి విషయాన్ని చిలవలు, పలవలుగా చేసి విమర్శలు చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదిస్తూ, దుర్భాషలాడుతున్నప్పటికీ మంత్రులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో...
ఎవరో ఒకరిద్దరు స్పందించినా వారి మాటలు మాత్రం జనంలోకి వెళ్లడం లేదు. ప్రత్యర్థులు చేసిన విమర్శలే ఎక్కువ హైలెట్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో పెద్దయెత్తున భూ కుంభకోణం జరిగిందని, దాదాపు పదివేల కోట్ల రూపాయల డీల్ జరిగిందంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నుంచి సరైన కౌంటర్ రాలేదు. గతంలో కేసీఆర్ హయాంలో ప్రజల నుంచి ఎటువంటి ఆందోళన తలెత్తినా ఊరుకునే వారు కారు. గొంతెత్తితే కేసులు నమోదు చేసేవారు. కనీసం ధర్నా చౌక్ లో ఆందోళన చేసుకునేందుకు కూడా వీలుండేది కాదు. అదే సమయంలో పౌరహక్కుల సంఘాలతో పాటు పార్టీ నేతలతో భేటీ అయ్యే వారు కాదు.
సోషల్ మీడియా కూడా...
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకుంటున్నా తెలంగాణాలో మేధావులతో పాటు ప్రజాసంఘాల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులు రాలేదని కొందరు. కేబినెట్ లో ఉండి కూడా నామమాత్రంగా మరికొందరు ప్రేక్షకపాత్ర పోషిస్తుండటంతో రేవంత్ కు మద్దతుగా నిలిచేవారు కరువయ్యారు. దీనికి తోడు బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పోటీగా కాంగ్రెస్ సోషల్ మీడియా బలహీనంగా ఉందని గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే అర్ధమవుతుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పలేక కాంగ్రెస్ తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికైనా నేతల తీరు మారాలని పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.
Next Story