జూపల్లి వర్సస్ నాగం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వివాదాలు వీడేలా లేవు. ఓవైపు సీఎం అభ్యర్థుల వర్గపోరు విసిగిస్తుంటే.. మరోవైపు సీనియర్ నేతల
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వివాదాలు వీడేలా లేవు. ఓవైపు సీఎం అభ్యర్థుల వర్గపోరు విసిగిస్తుంటే.. మరోవైపు సీనియర్ నేతల టికెట్ వివాదాలు చికాకు పుట్టిస్తున్నాయి. గత రెండు నెలలుగా రాష్ట్ర పార్టీ నాయకుల నడుమ జరుగుతున్న అంతర్గత పోరును పెద్దలందరూ కలిసి సద్దుమణిగేలా చేశారు. హమ్మయ్య.. రాద్దాంతాలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి అనుకుంటున్న సందర్భంలో నిన్న నాగం జనార్ధన్ రెడ్డి మరో నేతపై భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి కాంగ్రెస్ పార్టీ చతికిలబడుతూ వచ్చింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎందరో నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని తీరని నష్టం కలిగించారు. అలాంటి సమయాల్లో పార్టీని వీడకుండా విధేయులుగా చాలా మంది ఉండిపోయారు. వాళ్లలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపుర్‌కు చెందిన చింతలపల్లి జగదీశ్వర్ రావు ఒకరు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ కొత్త వర్గపోరుకు దారితీశారు. తనకు కొల్లాపుర్ టికెట్ తో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ టికెట్లను అడుగుతున్నారట. తనకు ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా ఆ మూడు సీట్లను గెలిపించుకోగలను అని జూపల్లి చెప్తున్నారట. దీంతో.. జిల్లాలోని ఆశావహులు, సీనియర్ నేతలు ఖంగుతిన్నారట. మంత్రిగా ఉండి పోటీ చేసి ఓడిపోయిన జూపల్లి అసలు కొల్లాపుర్ టికెట్‌ని అయినా ఎలా ఆశిస్తారు? కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచిన హర్షవర్ధన్ ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా కుదేలైన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది జగదీశ్వర్ రావు. అతనికే పార్టీ టికెట్ ఇస్తామన్న సందర్భంలో జూపల్లి కొత్తగా వచ్చి ఇలా రాద్దాంతం చేయడం బాగాలేదని నాగం జనార్ధన్ చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నమొన్నటివరకూ నాగం, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అతని తనయుడు ముగ్గురు టికెట్ ఆశావహులు ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ సమస్యను పరిష్కరించి ఆ ముగ్గురిలో సమన్వయం తెచ్చారు. కానీ ఇప్పుడు జూపల్లి డిమాండ్లతో జిల్లాలో కొత్త వివాదం రేగింది.