Sun Dec 22 2024 23:25:28 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : రాత్రంతా నిద్రపోలేదట.. పుస్తకాలు చదువుతూ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయిన కవితను నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొలి రోజు ప్రశ్నించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయిన కవితను నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొలి రోజు ప్రశ్నించనున్నారు. కవితను ఈ నెల 23వ తేదీ వరకూ ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగిస్తూ ఆదేశించిన నేపథ్యంలో నేడు తొలిరోజు విచారణ జరగనుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ కవితను విచారించే అవకాశముంది. ప్రస్తుతం కవిత ఢిల్లీ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర కార్యాలయంలోనే రాత్రంతా ఉన్నారు. కవిత తొలి రోజు రాత్రి పుస్తకాలు చదువుకుంటూ ఉన్నారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కొత్త ప్రదేశం కావడంతో నిద్ర పోలేదని, ఎక్కువ సేపు పుస్తకాలు చదువుతూనే ఉన్నారని తెలిపారు.
న్యాయనిపుణులతో...
కాగా కవిత కస్టడీ పిటీషన్ లో కొన్ని మినహాయింపులను కోర్టు ఇచ్చింది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ప్రతి రోజూ కుటుంబసభ్యులను, న్యాయవాదులను కలిసేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఇంటి నుంచి ఆహారం, మందులను తెప్పించుకునేందుకు అనుమతించింది. విచారణను వీడియో తీయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. మహిళ అధికారుల భద్రత మధ్య ప్రత్యేక గదిలో రాత్రి కవిత గడిపారు. కాగా కవిత అరెస్ట్ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.ఈరోజు కవితతో పాటు న్యాయనిపుణులను కలసి కవిత బెయిల్ పిటీషన్ పై చర్చించనున్నారు.
Next Story