Thu Apr 03 2025 21:29:02 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కాంగ్రెస్ నేతలకు ట్విస్ట్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్.. ఇక వారికి పదవులు దక్కడం అసాధ్యమేనా?
మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పదవుల కోసం పోటీ పడుతున్న వారికి ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నియమితులయిన తర్వాత వరసగా జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పదవుల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ పదవులు కావచ్చు. రాబోయే కాలంలో ఖాళీ కానున్న పదవుల విషయంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.
మూడు గ్రూపులుగా...
ఇందుకోసం కాంగ్రెస్ లో ఉన్న నేతలను మూడు గ్రూపులుగా విభజించారు. 1. కాంగ్రెస్ లో చేరిన వారిని ఒక గ్రూపు. 2. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారు ఒక గ్రూపు. 3. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో జాయిన్ అయిన వారిని మరొక గ్రూపు. ఇలా మూడు గ్రూపులుగా విభజించి పార్టీ ఐడియాలజీని గౌరవించి వారిని అమలు చేసే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మూడు గ్రూపులుగా ఏర్పాటు చేయడానికి అవసరమైన బాధ్యతను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఉంచినట్లు తెలిసింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండటంతో పాటు పార్టీ లైన్ ను థిక్కరించడమే కాకుండా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత వచ్చిన నేతలు పైరవీలు చేసుకుని పదవులు పొందేందుకు పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తుండటంతో మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పార్టీకి దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న నేతలకు ఇక మంచి రోజులు వచ్చినట్లే. అదే సమయంలో అప్పటికప్పుడు వచ్చి పదవులు పొందాలని ప్రయత్నించే వారికి కూడా ఒక రకంగా మీనాక్షి నటరాజన్ షాకిచ్చినట్లే అనుకోవాలి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులకు మీనాక్షి నటరాజన్ శ్రీకారం చుట్టబోతున్నట్లే అనిపిస్తోంది. ఈ నిర్ణయం జంపింగ్ జంపాంగ్ లకు షాక్ తగిలినట్లే.
Next Story