Sun Dec 22 2024 15:36:09 GMT+0000 (Coordinated Universal Time)
Konda Surekha : కొండా పై చర్యలు తప్పవా? చేసుకున్న వారికి చేసుకున్నంతేనా?
కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ తలనొప్పిగా తయారయ్యారు. ఏదో ఒక వివాదంలో ఉంటారు
కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ తలనొప్పిగా తయారయ్యారు. కొండా సురేఖ ఎప్పుడూ అంతే. ఏదో ఒక వివాదంలో ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా అంతే. ఒకరితో పడదు. అందులోనూ మంత్రిపదవిలో ఉంటే తానే ఆధిపత్యం చెలాయించాలని భావించడమే ఈ పరిస్థితికి వచ్చింది. వరంగల్ జిల్లాలో తన నియోజకవర్గానికే పరిమితమవ్వాల్సిన మంత్రిగారు అన్ని నియోజకవర్గాల్లో వేలుపెట్టడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండా మురళికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనుచరులున్నారు. వారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేలను కూడా లెక్కచేయని తనం ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. ఆమె లైన్ తప్పి వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నుంచే
ఇతర నియోజకవర్గాల్లో వేలుపెట్టి...
ఇక తాజాగా తన పాత నియోజకవర్గమైన పరకాలలో ఆమె పోలీస్ స్టేషన్లో చేసిన హల్చల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతమాత్రమే కాదు పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశరెడ్డి ఆగ్రహానికి కూడా కారణమయింది. పరకాల నియోజకవర్గంలో ఫ్లెక్సీల చించివేత కేసులో కొండా అనుచరులు అరెస్ట్ కావడంతో ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ విడిపించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. వీరంతా కలసి ఒక గ్రూపుగా ఏర్పడి మంత్రిపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లను కలసి తమ గోడుచెప్పుకున్నారు. అయితే ఇది కూడా హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. కొండా సురేఖ ఇలా చికాకులు కలిగించడమేంటని నేతలే తలలు పట్టుకుంటున్నారు.
ఢిల్లీకి వెళ్లి...
మరోవైపు ఈరోజు ఏడుగురు వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్ఫూర్, నర్సంపేట, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు ఆమె పై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే పీసీసీ చీఫ్ జోక్యతో విరమించుకున్నారని తెలిసింది పదవుల పంపిణీలో కూడా జోక్యం చేసుకోవడంతో ఈ వైరం మొదలయిందంటున్నారు. కొండా సురేఖ తన అనుచరులను జిల్లా అంతటా విస్తరించడం కోసం మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యేలపై తమపై ఆధిపత్య పోరును ప్రదర్శిస్తుందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కొండా సురేఖ మంత్రిగా జిల్లాను అభివృద్ధి చేయాల్సిన సమయంలో ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే వివాదాలు తెచ్చి పెట్టుకుని తనకు తానే ముప్పు తెచ్చుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story