Sat Nov 23 2024 16:56:23 GMT+0000 (Coordinated Universal Time)
విచారణను ఎదుర్కొనే దమ్ము మాకుంది : కేటీఆర్
మోదీని వ్యతిరేకించిన వారిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు
మోదీని వ్యతిరేకించిన వారిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ నేతలకు వరసగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వలేదని, మోడీ దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అదానీపై అంత పెద్ద స్థాయిలో ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈ ప్రభుత్వం విపక్ష పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందని అన్నారు.
సుజనా చౌదరి కేసులు...
బీజేపీలో చేరిన వెంటనే మాజీ ఎంపీ సుజనా చౌదరి కేసులన్నీ మాఫీ అయిపోయినట్లేనా అని ప్రశ్నించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లు కమలం కండువా కప్పుకోగానే పునీతులయ్యారని ఎద్దేవా చేశారు. గౌతం అదానీ ఎవరి బినామీ అన్న సంగతి దేశమంతా తెలుసునని అన్నారు. అదానీకి ఆరు పోర్టులు ఇవ్వడంపై నీతి అయోగ్ తప్పు పట్టిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంటే ఏంది? గుజరాత్ లో అక్రమ మద్యం తాగి చనిపోతే దానిని లిక్కర్ స్కామ్ అంటారని కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో జరిగింది లిక్కర్ స్కామ్ కాదని అన్నారు.
ప్రజా కోర్టులోనే...
మోదీ దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరుక్కున్న బీఎల్ సంతోష్ పరారయ్యాడన్నారు. తాము మాత్రం పరారు కాలేదని, తప్పు చేయలేదని, విచారణను ఎదుర్కొనే దమ్ము తమకు ఉందని కేటీఆర్ తెలిపారు. కవిత విచారణకు హాజరవుతారని చెప్పారు. రాజకీయపరమైన కక్ష సాధింపులను ప్రజా కోర్టులోనే ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు. కర్ణాటకలో అవినీతి ఎమ్మెల్యే దొరికినా చర్యలు ఏవీ ఉండవన్నారు. న్యాయవ్యవస్థ పైన తమకు నమ్మకం ఉందని, న్యాయపరంగానే కేసులను ఎదుర్కొంటామని తెలిపారు. ఆరోపణలు ఎప్పుడూ వాస్తవాలు కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Next Story