Fri Nov 22 2024 19:13:51 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : సినీ పరిశ్రమ ఇక ఎందుకు ఏపీకి వస్తుంది బాలయ్యా? ఇలా చేస్తే?
సినీనటుడు బాలకృష్ణ సినీ స్టూడియోకు సంబంధించిన భూ కేటాయింపులపై చీఫ్ సెక్రటరీకి రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు కూడా పంపింది.
ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుంది. అందరూ తెలంగాణలోనే స్థిరపడిపోయారు. ఎక్కువ షూటింగ్ లు, స్టూడియోలు కూడా ఇక్కడే ఉన్నాయి. అక్కడ మరో స్టూడియోను నిర్మించడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. అందులో సినీ పరిశ్రమకు అత్యంత ఇష్టుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణంతో పాటు అనేక సమస్యలు స్టూడియోల ఏర్పాటుతో పాటు, షూటింగ్ లకు కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం ఉంది.
టాలీవుడ్ మొత్తం...
టాలీ వుడ్ మొత్తం హైదరాబాద్ లోనే స్థిరపడింది. హీరోల దగ్గర నుంచి చిన్న తారల వరకూ ఇక్కడే సొంత ఇళ్లను నిర్మించుకుని ఉన్నారు. ఇక్కడే షూటింగ్లు చేసుకుంటూ తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇక 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన అన్ని శాఖలకు చెందిన వారు ఇక్కడే స్థిరపడిపోయారు. కొన్నేళ్లుగా హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ నిలదొక్కుకుంది. స్టూడియోలున్నాయి. డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి. సినిమాకు అవసరమైన అన్ని హంగులు క్షణాల్లో లభ్యమయ్యే వెసులుబాటు హైదరాబాద్ లో మాత్రమే ఉంది. అదే విజయవాడ, విశాఖపట్నంలలో అటువంటి అవకాశాలు మాత్రం లేవు.
కొన్ని కుటుంబాలు...
టాలీవుడ్ కొన్ని కుటుంబాలు స్టూడియోలతో పాటు సినీ పరిశ్రమపై పట్టుంది. అందులో మెగా కుటుంబం, నందమూరి కుటుంబంతో పాటు నిర్మాతలైన సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి వాళ్లు నిర్మాతలుగా ఉన్నారు. వీరంతా తమ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి మాత్రమే చేస్తుండటంతో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు రావడం అంత సులువు కాదు. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో పాటు అనుకూలమైన వాతావరణం, జూనియర్ ఆర్టిస్టుల లభ్యంతో పాటు అన్ని వసతులు ఉండటంతో హైదరాబాద్ లో సులువుగా షూటింగ్ లు చేసుకునే వీలుంది. ఇక్కడే పోస్టు, ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చు.
ఎమ్మెల్యే అయి ఉండి...
కానీ ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టాలంటే అన్నింటికీ శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు తాజాగా నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఉన్న బాలకృష్ణ కూడా స్టూడియో కోసం స్థలం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. బాలకృష్ణ సినీ స్టూడియోకు సంబంధించిన భూ కేటాయింపులపై చీఫ్ సెక్రటరీకి రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు కూడా పంపింది. ఈరోజు కేబినెట్ లో దీనిపై ఆమోదం తెలిపే అవకాశముంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. బాలయ్య సినీ హీరో మాత్రమే కాదు. ఏపీలో శాసనసభ్యుడు. తన సొంత బావ ముఖ్యమంత్రి. తన ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట కాకుండా హైదరాబాద్ లోనే బాలయ్య బాబు స్టూడియో నిర్మాణం చేపడుతున్నారంటే మరొకరు ఎలా ఏపీకి వస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ ఘటనతో ఇక ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి అసాధ్యమనే చెప్పాలి.
Next Story