జగిత్యాలలో గల్ఫ్ కార్మిక నాయకులు ఒక బహిరంగ లేఖ
2024 మార్చి 18న జగిత్యాలకు విచ్చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి 88 లక్షల మంది భారతీయ గల్ఫ్ వలస కార్మికుల పక్షాన జగిత్యాలలో గల్ఫ్ కార్మిక నాయకులు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
2024 మార్చి 18న జగిత్యాలకు విచ్చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి 88 లక్షల మంది భారతీయ గల్ఫ్ వలస కార్మికుల పక్షాన జగిత్యాలలో గల్ఫ్ కార్మిక నాయకులు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
తేదీ: 17.03.2024
శ్రీయుత గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారు భారత ప్రధాన మంత్రి
ఆర్యా !
2024 మార్చి 18న మీరు జగిత్యాలకు విచ్చేస్తున్న సందర్భంగా గల్ఫ్ కార్మికుల పక్షాన సాదర స్వాగతం.
విషయం: గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి
గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.
గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.
కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.
భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
◉ ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.
◉ విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.
◉ హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.
◉ గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.
◉ వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.
◉ ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.
◉ ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.
◉ విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.
◉ భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి.
◉ భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.
◉ ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు.
ఇట్లు
గుగ్గిల్ల రవిగౌడ్
చైర్మన్, గల్ఫ్ జెఏసి
+91 89783 73310
సింగిరెడ్డి నరేష్ రెడ్డి
టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్
+91 90104 44111
మంద భీంరెడ్డి
టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్
+91 98494 22622
సయిండ్ల రాజిరెడ్డి & ఎం. నాగభూషణం,
ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్
+91 94400 88177