Mon Dec 23 2024 09:25:31 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..!
హైదరాబాద్ మెట్రో రూ. 13,000 కోట్ల అప్పు, నభా పవర్ రూ. 6,000 కోట్ల అప్పులు దూరమైతే, ఉండేది రూ. 20,000 కోట్ల అప్పు మాత్రమే..
హైదరాబాద్ : లార్సెన్ అండ్ టూబ్రో (L&T) హైదరాబాద్ మెట్రో, నభా పవర్, L&T ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే 3 ప్రాజెక్ట్లలో తన వాటాలను విక్రయించాలని నిర్ణయించుకుంది. 40,000 కోట్ల రూపాయల రుణాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లార్సెన్ అండ్ టూబ్రో మొత్తం అప్పులు 1,24,000 కోట్ల రూపాయలు. అందులో 84000 కోట్ల రూపాయలు L&T ఫైనాన్షియల్ సర్వీసెస్ (Financial Services) కు సంబంధించినది. కాబట్టి ఇది అప్పు కిందకు రాదు. కాబట్టి ఇక మిగిలింది 40000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ మెట్రో అమ్మకం ద్వారా 13000 కోట్ల రూపాయలు.. నభా పవర్ ద్వారా 6000 కోట్ల రూపాయలు సేకరించి అప్పులు తీర్చేయాలని లార్సెన్ అండ్ టూబ్రో భావిస్తోంది.
"హైదరాబాద్ మెట్రో రూ. 13,000 కోట్ల అప్పు, నభా పవర్ రూ. 6,000 కోట్ల అప్పులు దూరమైతే, ఉండేది రూ. 20,000 కోట్ల అప్పు మాత్రమే, ఇది ఎల్ అండ్ టీకి వర్కింగ్ క్యాపిటల్ కిందకు వస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి జీరో-డెబ్ట్ కంపెనీ ( zero-debt company) గా మారగలము, "అని L&T MD & CEO SN సుబ్రహ్మణ్యన్ అన్నారు. రూ. 18,000 కోట్ల L&T మెట్రో రైల్ (హైదరాబాద్) ప్రాజెక్ట్ 35 సంవత్సరాల రాయితీ వ్యవధిని కలిగి ఉంది, దీనిని కావాలనుకుంటే పొడిగించవచ్చు. అనేక కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అయింది.. మొదట్లో ప్రాజెక్ట్ ఖర్చులు పెరగడానికి కూడా కారణమైంది. అందువల్ల ప్రాజెక్ట్ నుండి వచ్చే ఆదాయం అంచనా వేసిన వ్యయంతో సరిపోలలేదు. తరువాత కోవిడ్-19 మహమ్మారి కారణంగా కూడా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ పై ప్రభావం పడింది.
"ప్రాజెక్ట్ ను సరిగ్గా రెండు అంశాలు దెబ్బతీశాయి. ఒకటి.. కోవిడ్ కారణంగా చాలా మంది ప్రజలు కార్యాలయానికి వెళ్లడం లేదు. ట్రాఫిక్ చాలా బాగా తగ్గిపోయింది, ఇప్పుడు మునుపటి లాగా మారే అవకాశం ఉంది. రెండవ అంశం దాదాపు రూ. 13,000 కోట్ల భారీ రుణం, కాబట్టి వడ్డీ భారం ఉంటుంది "అని సుబ్రహ్మణ్యన్ చెప్పారు. "తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 3,000 కోట్ల (ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్కు) రూపాయలు సాఫ్ట్లోన్ ఇవ్వాలని ఆదేశించింది. మేము దానిని కట్టడానికి ఒప్పందంపై పని చేస్తున్నాము. అది పూర్తయితే, ప్రాజెక్ట్ రుణం ₹10,000 కోట్లకు తగ్గుతుంది" అని సుబ్రహ్మణ్యన్ తెలిపారు.
Next Story