Fri Nov 22 2024 23:32:02 GMT+0000 (Coordinated Universal Time)
Medaram : నేటి నుంచి జాతర ప్రారంభం.. నాలుగు రోజుల పాటు కోటి మందికి పైగా దర్శించుకునే అవకాశం
దక్షిణ భారత దేశంలో అతి పెద్ద కుంభమేళాగా జరిగే మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.
మేడారం జాతరకు అంతా సిద్ధమయింది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద కుంభమేళాగా జరిగే మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివాసీల ఆరాధ్య వనదేవతలను దర్శించుకుని మొక్కులు సమర్పించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఈ నెల 24వ తేదీ వరకూ జరగనుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి సీతక్క అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. కోట్లాది మంది ఒక్కసారి ఒక్కచోటకు రావడంతో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అన్ని ఏర్పాట్లు...
మంచినీటి వసతి, భోజనాలు, స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. వీవీఐపీలు వచ్చినా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రత్యేకంగా వనదేవతల వద్దకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులు వీవీఐపీల రాకతో ఇబ్బంది పడకూడదని భావించి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్ల రూపాయలను కేటాయించింది. నిన్న సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి గద్దెల మీదకు గిరిజన పూజారులు తీసుకు వచ్చారు. ఈరోజు ఉదయం ఏటూరునాగారం మండలం నంచి కొండాయి గుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజులను తీసుకు వస్తారు.
వీవీఐపీల రాకతో....
ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కూడా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటారు. బంగారాన్ని సమర్పిస్తారు. ఈ మేడారం జాతర కోసం పదివేల మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. 700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు లక్కవరం నుంచి నీటిని జంపన్నవాగుకు విడుదల చేశారు. ఇక పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నలభై ప్రాంతాల్లో స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు పది లక్షల వరకూ పెట్టుకునే వీలుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మేడారం జాతరకు మూడు కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది.
Next Story