Sat Nov 23 2024 02:34:58 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర తేదీలు ఖరారు
2024, ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి నాడు మండమెలిగే పండుగతో అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది. 21వ తేదీ మాఘశుద్ధ..
తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పిలువబడే మేడారం మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర తేదీలను పూజారులు నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు సమావేశమై తేదీలను ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 21 నుండి 28 తేదీల మధ్య మహాజాతర జరగనుంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ మహా జాతరలో ఆదివాసీ గిరిజన దైవాలుగా కొలువబడే సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు కోటిమందికి పైగా భక్తులు వస్తారు.
2024, ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి నాడు మండమెలిగే పండుగతో అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది. 21వ తేదీ మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గుడి మెలిగే పండుగతో పాటు సారలమ్మ దేవత, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఆ రోజునుండే అసలైన మేడారం జాతర మొదలవుతుంది. 22వ తేదీ మాఘశుద్ధ త్రయోదశి గురువారం కంకవనం గద్దె మీదకు వచ్చుట, సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటారు. 23వ తేదీ మాఘ శత్రుదశి శుక్రవారం సమ్మక్క-సారలమ్మ దేవతలు, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. 24వ తేదీ మాఘశుద్ధ పౌర్ణమి శనివారం రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 28 మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజు తిరుగు వారం పండుగను నిర్వహిస్తారు. ఆ రోజుతో మేడారం మహాజాతర క్రతువు ముగుస్తుంది.
Next Story