Mon Dec 23 2024 08:25:24 GMT+0000 (Coordinated Universal Time)
మాదాపూర్ ట్రాఫిక్ బూత్ లో మందుబాబుల హంగామా
ఇద్దరు పోకిరీలు మందు కొట్టడానికి ఏకంగా జంక్షన్ బూత్ నే అడ్డాగా మార్చుకోవడం చర్చకు దారితీసింది. నిత్యం రద్దీగా ఉండే..
సాధారణంగా ఏదైనా జంక్షన్ లో ఏర్పాటు చేసిన బూత్ లలో ట్రాఫిక్ పోలీసులు కూర్చొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం, సిగ్నల్స్ ను కంట్రోల్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే అటువంటి ఓ బూత్ లో ఇద్దరు మందుబాబులు కూర్చుని బిర్యానీ తింటూ, మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. మాదాపూర్ లోని హైటెక్ సిటీ జంక్షన్ లో సైబర్ టవర్స్ కు ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్ లో శనివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.
ఇద్దరు పోకిరీలు మందు కొట్టడానికి ఏకంగా జంక్షన్ బూత్ నే అడ్డాగా మార్చుకోవడం చర్చకు దారితీసింది. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో.. పోకిరీలు ఇలాంటి పనులు చేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా ఆ బూత్ కి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి ఉంటాయి. అయినా కూడా ఈ పోకిరీలు చేస్తున్న పనిని పోలీసులు అడ్డుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
కొందరు నెటిజన్లైతే.. ఆ బూత్ లో కూర్చున్న ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారంటూ.. జోకులు పేలుస్తున్నారు. ఒక నెటిజన్ పెరిగిన మద్యం ధరలపై చర్చించుకుంటూ ఉంటారని అంటే.. మరొకరు ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుని ఉంటారని పేర్కొన్నాడు. ఇంకొకరైతే.. హైటెక్ నగరంలోని సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్ వద్ద ఈ ఇద్దరు వైన్ ప్రియులు మద్యం బాటిల్తో ఎన్ని పెగ్గులు పెట్టుకోవచ్చో చర్చించుకుంటున్నారని ట్వీట్ చేశారు.
Next Story