Mon Dec 23 2024 03:16:32 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మరో రెండు రోజులు భారీ వర్షాలు.. నదులన్నీ ఉప్పొంగుతున్నాయిగా
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుండ పోత వానలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దెబ్బకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రహదారులు అనేక చోట్ల తెగిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ - తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చోట్ల ప్రమాదకర స్థాయి నుంచి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
సురక్షిత ప్రాంతాలకు...
దీంతో అప్రమత్తమయిన అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. కడెం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో కొన్ని లోతట్లు ప్రాంతాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. పునరావాస కేంద్రాలకు వారిని తరలించే ప్రక్రియను చేపట్టారు. ప్రాణహిత ప్రాజెక్టులోనూ వదర ఉధృతి ఎక్కువగా ఉంది. ఇక భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తిని అధికారులు నిలిపేశారు. భూపాలపల్లి - పెద్దపల్లి - ములుగు ప్రాంతాలకు రాకపోకలు కట్ అయ్యాయి.
ఉపాధి లేక...
మట్టి ఇండ్లు భారీ వర్షాలకు దెబ్బతినే అవకాశాలుండటంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవననిర్మాణ రంగం పనులు నిలిచి పోవడంతో ఉపాధి లేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. చిరు వ్యాపారులు సయితం వ్యాపారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తెచ్చుకున్న తమ ఉత్పత్తులు అమ్ముడు పోవడం లేదని వాళ్లు వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రహదారులపై నీరు చేరడంతో కనీసం రోడ్డు మీదకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయ పనులు కూడా నిలిచిపోయాయి. దీంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Next Story