Sat Dec 28 2024 10:56:55 GMT+0000 (Coordinated Universal Time)
MIM : ఎంఐఎం గుర్తు గాలిపటం.. ఎటు గాలి వీస్తే అటువైపే వెళుతుందిగా?
ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే అటు వైపు ఉంటారు. తమకు పాతబస్తీలో బలం తగ్గదని తెలిసినా ఎందుకో తెలియదు
ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే అటు వైపు ఉంటారు. తమకు పాతబస్తీలో బలం తగ్గదని తెలిసినా ఎందుకో తెలియదు కానీ ఆ పార్టీ అధికార పార్టీకి దగ్గరగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. ఎప్పుడూ సల్తావుద్దీన్ ఒవైసీ మరణం తర్వాత ఇదే తంతు జరుగుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. నాడు పదేళ్లు కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరింత కాంగ్రెస్ కు చేరువయ్యారు. ఎంఐఎం అంటేనే కాంగ్రెస్ పార్టీ వెనక ఉంటుందన్న పేరు తెచ్చుకున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దీంతో కారు పార్టీ వెంట ఒవైసీ సోదరులు పరుగులు తీశారు.
పదేళ్ల పాటు...
బీఆర్ఎస్ తో బంధం పదేళ్ల పాటు సాగింది. ఎన్నికల సమయంలోనూ ప్రత్యక్షంగా రెండు పార్టీలూ ఎన్నికలలో పొత్తు కుదుర్చుకుపోయినప్పటికీ లోపాయికారీ అవగాహన మాత్రం కుదిరింది. బీఆర్ఎస్ గెలవాలనుకున్న చోట బలహీనమైన ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టడం, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట బలమైన ఎంఐఎం అభ్యర్థిని పోటీకి దింపి బీఆర్ఎస్ విజయానికి కారణమయిందన్న విమర్శలు కూడా అనేకం వచ్చాయి. అనేక దఫాలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గులాబీ బాస్ కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష హోదాను ఎంఐఎంకు కట్టబెడుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత...
తర్వాత బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. పదేళ్ల పాటు సాగిన మితృత్వాన్ని తెగదెంపులు చేసుకుని ఇప్పుడు హస్తం పార్టీతో నడకను కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పై విమర్శలకు కూడా దిగుతున్నారు. అనేక అంశాలపై బీఆర్ఎస్ ను బహిరంగంగా వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ ను చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నాడు కేంద్రంలోనూ కాంగ్రెస్ కు మద్దతుగా నిలవని గాలిపటం పార్టీ ఇప్పుడు అక్కడా, ఇక్కడా ఒకటే నినాదం అందుకుంది. గాలి ఎటు వైపు వీస్తుందో అటు వైపు పతంగి వెళ్తుంది. అలాగే ఎంఐఎం పార్టీ కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతుండటం విమర్శలకు తావిస్తుంది.
ఘాటు విమర్శలు...
తాజాగా ఆదిలాబాద్ జిల్లా జైనూర్ ఘటనపై కూడా ఎంఐఎం బీఆర్ఎస్ పై మండిపడుతుంది. బీఆర్ఎస్ మాత్రం ఎంఐఎం గురించి పన్నెత్తు మాట అనకపోయినా ఒవైసీ బ్రదర్స్ మాత్రం కారు పార్టీపై విరుచుకపడుతున్నారు. జైనూరులో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారంపై ఒవైసీ మాట్లాడుతూ బీజేపీ నేతల కంటే బీఆర్ఎస్ నేతలే అల్లర్ల ఘటనలో నిందితులుగా అల్లర్ల కేసులో ఉన్నారంటూ ఆరోపించారు. అంతేకాదు బీఆర్ఎస్ కు సూటి ప్రశ్నలు వేశారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందని ఆయన ప్రశ్నించారు. మౌనంగా ఉంటే తాము కూడా రాజకీయంగా వెయిట్ చేయడం తెలుసునంటూ చురకలంటించారు. ఇలా బీఆర్ఎస్ తో బంధాన్ని తెంచుకున్న ఎంఐఎం హస్తం పార్టీతో కలసి పోయేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతుంది.
Next Story