కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్.. నిర్మలకు హరీశ్ సవాల్
తెలంగాణలో టీఆర్ఎస్.. బీజేపీ నడుమ మరోమారు మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై గులాబీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బాన్సువాడ పర్యటనలో రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో మోదీ ఫొటో లేకపోవడాన్ని నిర్మల తీవ్రంగా తప్పుబట్టారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్ర వాటానే ఎక్కువని.. అలాంటప్పుడు ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. కామారెడ్డి కలెక్టర్‌కు క్లాస్ కూడా తీసుకున్నారు.
ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారడంతో టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. నిర్మలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు నిర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు అబద్ధాలు చెప్పే పార్టీ బీజేపీ అని.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు మాట్లాడి వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. రేషన్ షాపులో ప్రధాని ఫొటో పెట్టాలనడం హాస్యాస్పదమన్నారు. దేశాన్ని పోషిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. కేంద్రాన్ని, కొన్ని రాష్ట్రాలను ఆదుకుంటున్నామని అక్కడ కేసీఆర్ ఫొటో పెట్టాలని అడిగితే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని నిర్మల చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని హరీశ్ సవాల్ విసిరారు.