కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమే: హరీష్‌రావు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ఆయా పార్టీలు దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ఆయా పార్టీలు దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను సైతం వేగవంతం చేసింది. గురువారం నర్సంపేట్ మెడికల్ కాలేజ్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్‌రావు.. సీఎం కేసీఆర్ వల్ల ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతోందని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దేశంలో ఎక్కడా లేదని, నర్సంపేటలో మెడికల్ కాలేజీ రావడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ కోసం భూమిపూజ చేసి, గృహలక్ష్మి, దళిత బంధు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రొసీడింగ్స్‌ను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 ఉందని అన్నారు. అలాగే వైద్యులను ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుంటుందని అన్నారు. కాళేశ్వరం, పాలమూరుతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, ఇక్కడి చెరువులు నిండుగా చేసుకున్నామని అన్నారు.
కాంగ్రెస్ సర్కారు హయాంలో తుమ్మలు తప్ప నీళ్ళు రాలేదని, నర్సంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉందని, నిరంతర కరెంట్ ఇవ్వడంలో నెంబర్ వన్, రైతు బంధు ఇవ్వడంలో నెంబర్ వన్ గా ఉందని, కాంగ్రెస్ హయాంలో మూడు ధర్నాలు ఆరు అరెస్టులతో విజృంభిస్తోందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ, చదువుతో పాటు వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా అధికారంలో వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. 10 కోట్లకు పీసీసీ అధ్యక్షుడు టికెట్ అమ్ముకున్నారని ఓ కాంగ్రెస్ నాయకుడే చెప్పాడని, టికెట్లు అమ్ముకున్న వాళ్ళు.. రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారని ఆరోపించారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాగవన్నారు.