Sat Nov 23 2024 02:15:52 GMT+0000 (Coordinated Universal Time)
అభివృద్ధే లేకపోతే అవార్డులెందుకు ? : మంత్రి హరీష్ రావు
ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు తిప్పికొట్టారు. సరైన సమయంలో ప్రధానికి గుణపాఠం..
ప్రధాని నరేంద్రమోదీ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సర్కార్ అవినీతి సర్కార్ అని, ఆయనది కుటుంబ పాలన అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు తిప్పికొట్టారు. సరైన సమయంలో ప్రధానికి గుణపాఠం చెబుతామన్నారు. ఢిల్లీలో అవార్డులిచ్చి.. గల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని తిడుతున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎవరి రాష్ట్రానికొచ్చి కేసీఆర్ ను తిడుతున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చినవారంతా కేసీఆర్ ని తిట్టేవారేనంటూ అసహనం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పదకాలను కాపీకొట్టిందన్నారు. తెలంగాణలో పెట్టిన ప్రతి పదకం పేరును మార్చి కాపీకొట్టారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటే.. అది కేసీఆర్ గొప్పతనమన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు ఇచ్చామని ప్రధాని అబద్ధాలు చెబుతున్నారంటూ యద్దేవా చేశారు. నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే నిజంగా మాకు రావాల్సిన డబ్బులు మాకివ్వండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. అభివృద్ధే జరగకపోతే ఢిల్లీలో వివిధ శాఖలకు అవార్డులు ఎందుకు ఇచ్చినట్లు ? అని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఏమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుడు తప్ప మీరు చేసేందేమి లేదు. మాట్లాడితే ఈడీని ఉపయోగిస్తున్నారు. మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉంటే.. మాకు తెలంగాణ ప్రజలే అండగా ఉంటారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Next Story