Fri Apr 18 2025 01:35:42 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి హరీష్ రావు చెత్తోపదేశం
పట్టణంలోని 18వ వార్డులో వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ నుంచి నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు..

మనకి వ్యక్తిగత శుభ్రత ఎంత అవసరమో.. పరిసరాల పరిశుభ్రత కూడా అంతే అవసరమని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. వీధుల్లో చెత్తపేరుకుపోతే.. వాటివల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి సిద్ధిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. సోమవారం ఉదయం ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని.. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛపట్టణం గా సిద్ధిపేటను తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు సిద్ధిపేటలో మనచెత్త - మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణంలోని 18వ వార్డులో వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ నుంచి నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. మురికి కాలువలో పేరుకుపోయిన పేపర్లు, కవర్లను ఆయనే స్వయంగా తొలగించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. మన చెత్త - మన బాధ్యత అంటూ పలు గృహిణులకు చెత్త పెరుకుపోతే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని హితవు పలికారు. చెత్తపేరుకుపోతే.. వర్షాకాలంలో అంటువ్యాధులు వేగంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని.. అలాగే నీటినిల్వలతో దోమలు కూడా పెరిగిపోతాయని.. తద్వారా డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని మంత్రి హరీష్ రావు ఉపదేశించారు.
Next Story