Mon Dec 23 2024 17:18:18 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు రేవంత్ : మంత్రి జగదీశ్ రెడ్డి
నీటికి, విద్యుత్ కు అడుగడుగునా వెతుక్కోవాల్సిన పనిలేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా.. రేవంత్ వ్యాఖ్యలతో 2004 నాటి..
తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అక్కర్లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపాయి. రైతుల పాలిట విద్వేష వైఖరితో ఉన్న కాంగ్రెస్ విధి విధానాలను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు నిరసనలు చేసి కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. 24 గంటల విద్యుత్ అక్కర్లేదన్న రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం నుంచి చంద్రబాబు వెళ్లిపోయినా.. రేవంత్ రెడ్డి రూపంలో ఆయన నీడజాడలు మిగిలే ఉన్నాయన్నారు.
నీటికి, విద్యుత్ కు అడుగడుగునా వెతుక్కోవాల్సిన పనిలేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా.. రేవంత్ వ్యాఖ్యలతో 2004 నాటి పరిస్థితుల్ని మళ్లీ గుర్తుచేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. 2004 లో చంద్రబాబు ఉచిత విద్యుత్ పై ఏం మాట్లాడారో రేవంత్ అదే మాట్లాడారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, వారసుడని నిరూపించుకున్నారన్నారు. రేవంత్ ఉచిత విద్యుత్ పై మాట్లాడిన మాటలు రైతులపై పిడుగుపాటు లాంటివేనని, రైతాంగం అన్ని బాధల నుంచి శాశ్వత విముక్తి వస్తుంది అనుకుంటున్న తరుణం లో రేవంత్ రూపం లో కొత్త బాధ వచ్చిపడిందన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఏంటో రేవంత్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మంత్రి జగధీష్ రెడ్డి అన్నారు.
రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీనే అన్న ఆయన.. గతంలోనూ ఏడుగంటల విద్యుత్ ను ఇవ్వలేకపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ జెండా పట్టుకున్న తెలంగాణ రైతాంగం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆలకించాలని, ఎవరు రైతుల పార్టీనో ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. ఒక ఎకరా తడపాలంటే గంట సేపు చాలన్నరేవంత్ కు అసలు వ్యవసాయం పై అవగాహన ఉందా ? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ 6 గంటల విద్యుత్ ఇస్తే.. అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్, ఇతర నేతలు ధర్నాలు చేసిన విషయం గుర్తులేదా ? అని ప్రశ్నించారు.
"నీ ఇంట్లో 24 గంటలు కరెంటు ఉండాలి. ఏసీ బంద్ కావొద్దు. రైతులకు మాత్రం 24 గంటలు ఇవ్వొద్దా ? ఇదేం లాజిక్ రేవంత్ రెడ్డి.. రైతులంటే కాంగ్రెస్ కు ఇంత చిన్న చూపా" అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన రేవంత్ వ్యాఖ్యలు.. ఆయన వ్యక్తిగతం కావన్నారు. కాంగ్రెస్ ది రద్దుల బతుకు అని, ప్రజలే కాంగ్రెస్ ను రద్దు చేస్తారని కాంగ్రెస్ తీరు పై రేపు రైతులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమిస్తాయన్నారు.
Next Story