Mon Dec 23 2024 13:23:46 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండి పడ్డారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని తెలిపారు
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండి పడ్డారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని తెలిపారు. యాదాద్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్బంగా జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. దళిత బంధు అని ప్రజలను మోసం చేశారన్నారు. బీసీ బంధు ఇస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంకా ఎప్పుడు ఇస్తారు అని నిలదీశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎంతమందికి ఇచ్చారన్నారు. సామాజిక న్యాయం లేదు, సచివాలయం లేదని ఆయన విమర్శలు చేశారు. ఉన్న సచివాలయాన్ని ఎందుకు కూల్చి వేశారన్నారు. నెలలో సగం రోజులు ఫాం హౌస్ లోనే ఉంటారన్నారు.
సచివాలయానికి...
మోదీ ఎనిమిదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రధాని కార్యాలయానికి రాకుండా ఉండలేదన్నారు. కానీ కేసీఆర్ ఏ ఒక్కరోజూ సచివాలయానికి రాలేదన్నారు. ప్రజలను కలిసేందుకు కేసీఆర్ కు సమయం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంపిణీ చేసేందుకు సమయం ఉంటుంది కాని, ఇక్కడ రైతులకు పరిహారాన్ని పంచేందుకు మాత్రం సమయం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు సగం రోజులు మోదీని తిట్టడానికే సమయం సరిపోతుందన్నారు.
అక్రమకేసులు...
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదన్నారు. అబద్ధాలకు అంతం లేదని, అక్రమకేసులకు న్యాయం లేదని ఆయన ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతావు కాని, ఈరోజు ఈడీ మీద విమర్శలు చేస్తావా? అని నిలదీశారు. 1200 మంది త్యాగాలు చేసింది కల్వకుంట్ల చేతిలో రాష్ట్రాన్ని పెట్టడం కోసం కాదన్నారు. రైతుల పాలిట టీఆర్ఎస్ పార్టీ శాపంగా మారిందని, మరో ఏడాదిలో ఈ ప్రభుత్వం మారిపోక తప్పదని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. అధికారులు న్యాయంగా పనిచేయాలని, ఒళ్లు దగ్గర పట్టుకోవాలని హెచ్చరించారు.
Next Story