Mon Dec 23 2024 15:18:33 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం కేసీఆర్ ఆలోచనలు కేంద్రానికి మార్గదర్శకం: కేటీఆర్
వరంగల్లోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
వరంగల్లోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఏర్పాటుచేసే కంపెనీల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు. యంగ్వన్ కంపెనీతో వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. దేశంలో వ్యవసాయం, టెక్స్టైల్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువని వెల్లడించారు. నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కాకతీయ టెక్స్టైల్ పార్కని.. వరంగల్కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో టెక్స్టైల్ పార్కు ఉండబోతోందని.. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే గణేశా కంపెనీ రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. యంగ్ వన్ కంపెనీ మొత్తం 11 పరిశ్రమలు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. దీని ద్వారా వేల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. వరంగల్ జిల్లాలో వచ్చే మూడు కంపెనీల వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మోడల్గా మారిందని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు కేంద్రానికి మార్గదర్శకం అయ్యాయని తెలిపారు. ఐదేండ్లు మీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు మీరు మాకు అండగా ఉండాలన్నారు. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీచేయాలంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని, నియోజకవర్గాలు మార్చుకుని మరీ వేరేచోటకు వెళ్లిపోతున్నారని చెప్పారు.
Next Story