Mon Dec 23 2024 11:09:04 GMT+0000 (Coordinated Universal Time)
బోనాల పండుగ.. తొలిబోనం సమర్పించిన మంత్రి
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బోనం..
తెలంగాణలో నేడు బోనాల పండుగ. తెలంగాణవాసులంతా.. బోనాలు పట్టుకుని అమ్మవారికి సమర్పించేందుకు జాతరగా వెళ్తున్నారు. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.. సతీసమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామని తలసాని తెలిపారు.
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ బృందం మంగళ వాయిద్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా బోనాల పండుగ పరంపర కొనసాగుతోందని, కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ ల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచీ కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే దేశమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పరిపాలన వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
Next Story