Sat Nov 16 2024 08:44:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా దోచుకున్నారు.. అప్పుల భారాన్ని మిగిల్చారు
గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల విషయంలోదుర్వినియోగం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల విషయంలోదుర్వినియోగం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటిపారుదల శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాగ్ రిపోర్ట్ లో అంశాలపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పుకున్న కాళేశ్వరం మూడేళ్లలోనే మూలనపడిందని ఆయన అన్నారు. గతంతో పోలీస్తే ప్రతి ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఖర్చు పెరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణను నట్టేట ముంచేశాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పనులు చేయకుండానే అనేక చోట్ల బిల్లులు చేసుకున్నారన్నారు.
కేసీఆర్ అంగీకారంతోనే...
అపెక్స్ కమిటీ మీటింగ్ లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారని, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపేయడం పట్ల తీవ్రనష్టం జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రభుత్వానికి భారంగా మారిందని ఆయన తెలిపారు. విద్యుత్తు ఛార్జీలకే ఏడాదికి 10,374 కోట్ల వ్యయం అవుతుందని ఆయన తెలిపారు. తెలంగాణకు నీటి వాటాను సాధించుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. గత పదేళ్లలో ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చు వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదని అన్నారు. గత ప్రభుత్వం ఏపీకి ఎక్కువ నీటి వాటాను కట్టబెట్టిందని అన్నారు.
రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్...
తెలంగాణకు అవసరమయ్యే కరెంటు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే కావాలి అని అన్నారు. కాళేశ్వరం కుంగిపోవడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అని ఆయన అన్నారు. కరెంటుతో పాటు నిర్వహణ కోసం కాళేశ్వరానికి ఏడాదికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా కూడా అనువైనది కూడా కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి నిషేధిత ప్రాంతంగానే ఉండేదని, పోలీసులను కాపలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. కాళేశ్వరం అంచనా వ్యయం 1.47 లక్షల కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలను ఎత్తి చూపిందన్నారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను తీసుకుందన్నారు.
అడ్డగోలుగా అవినీతి...
గత ప్రభుత్వం పదేళ్లలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడటం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల తెలంగాణకు భవిష్యత్ లో ప్రమాదకరంగా మారబోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మల్లన్న సాగర్ విషయంలోనూ కాగ్ అనేక లోపాలను బయటపెట్టిందని చెప్పారు. ఏపీకి ఎక్కువ నీళ్లను కట్టబెట్టేందుకు గత ప్రభుత్వం అంగీకరించడంతో దక్షిణ తెలంగాణకు శాపంగా మారిందని ఆయన అన్నారు. రీడిజైనింగ్ వల్ల మరింత ఆర్థిక భారం పడిందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 84 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల నిర్మాణం కోసం అప్పుగా తెచ్చిందని, ఇది తెలంగాణ ప్రజలకు భారంగా మారిందని చెప్పారు.
Next Story