మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారా? మల్కాజిగిరి సీటుపై కీలక వ్యాఖ్యలు
దేశంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఇటీవల తెలంగాణలోనూ కీలక రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి
దేశంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఇటీవల తెలంగాణలోనూ కీలక రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నుంచి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మారుతున్నారన్న పుకార్లు షికారు అవుతున్నాయి. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి కలువడంపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నరేందర్‌ను మల్లారెడ్డి కలిసిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను, తన కుమారుడు భద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే రూమర్స్ కు చెక్ పెట్టారు. మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి స్పష్టం చేశారు. అలాగే తన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీల భవనాల కూల్చివేత అంశంపై వేం నరేందర్ రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు.
అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు సిద్ధంగా ఉన్నారని మల్లారెడ్డి గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తనకు పోటీ చేసే ఆలోచన లేదని భద్రారెడ్డి పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై విజయం సాధించిన విషయం తెలిసిందే.
నిర్మాణాల కూల్చివేత:
ఇదిలా ఉండగా, హైదరాబాద్ శివార్లలో మర్రి రాజశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న రెండు కళాశాలల ఆవరణలోని కొన్ని నిర్మాణాలను అధికారులు గురువారం కూల్చివేశారు. దుండిగల్ లోని ఏరోనాటికల్ కళాశాల, ఎంఎల్ ఆర్ ఐటీఎం కళాశాలలోని రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారరులు కూల్చివేత ప్రక్రియ మొదలు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి, ఆయన అల్లుడు కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. ఇలాంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.