Big Breaking : కవితకు దక్కని ఊరట.. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియడంతో ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కస్టడీని పొడిగించాలంటూ ఈడీ పిటీషన్ వేసింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను ఈడీ అధికారులు కోరారు. మరో వైపు కవిత బెయిల్ పిటీషన్ పై కూడా వాదనలు ముగిశాయి. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఏప్రిల్ 16వ వరకూ కవిత కుమారులకు పరీక్షలున్నాయని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తిరిగి ఏప్రిల్ ఒకటో తేదీన విచారణ ఇస్తామని తెలిపారు. కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని ఈడీ బలంగా వాదిస్తుంది. కవిత తన వద్ద ఉన్న ఆధారాలు తమకు లభించకుండా సెల్ఫోన్లను కూడా ధ్వంసం చేశారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం వంద కోట్ల స్కామ్ కాదని, ఈ కుంభకోణం ఆరు వందల కోట్ల మేరకు జరిగిందన్నది ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.