మిస్టర్ నాయుడుకి పట్టిన గతే.. కోమటిరెడ్డి ఘాటు కామెంట్స్
మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, విపక్షాల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రంలో మన ప్రభుత్వమే రాబోతుందని.. బీజేపీయేతర ప్రభుత్వం వస్తుందంటూ నిన్న నిజామాబాద్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పోలుస్తూ కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కేంద్రంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కింగ్‌మేకర్‌గా ఎదిగిన చంద్రబాబు నాయుడు కూడా బీజేపీయేతర ప్రభుత్వం రావాలని కలలు కన్నారని.. మోదీపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆయనే రాజకీయంగా కనుమరగయ్యారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బఫూన్ కేసీఆర్‌కి కూడా అదే గతి పడుతుందని ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు.
నిజామాబాద్‌లో సోమవారం జరిగిన సభలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్రాల రైతులు తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని.. నిజామాబాద్ గడ్డ నుంచే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తానని ఆయన ప్రకటించారు. వచ్చే 2024 ఎన్నికల్లో దేశంలో మన ప్రభుత్వమే వస్తుందని.. బీజేపీయేతర ప్రభుత్వమే కేంద్రంలో ఉంటుందని ఆయన అన్నారు. అంతేకాకుండా బీజేపీయేతర ప్రభుత్వం రాగానే దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇస్తామని వరాలు కూడా కురిపించేశారు. జాతీయ రాజకీయాలు.. కేసీఆర్ హామీలపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.