Mon Dec 23 2024 14:24:25 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో పెరుగుతున్న చలితీవ్రత..54 ఏళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు
ప్రతి ఏటా నవంబర్ రెండో వారంలో చలి తీవ్రత పెరుగుతుంది. కానీ ఈసారి అక్టోబరు మూడో వారం నుంచి చలితీవ్రత ..
దీపావళి పండుగతో శీతాకాలం ఆరంభమవుతుంది. దీపావళి వెళ్లి.. వారమే అయినా.. అప్పుడే చలి వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అక్టోబర్ నెలలో తెలంగాణలో 54 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం గమనార్హం. 1968 అక్టోబరు 26న హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రత 11.7 డిగ్రీలుగా నమోదైంది. మళ్లీ ఇన్నేళ్లకు ఈనెల 24న 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 22న 19.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాతి రోజుకు అది 16.3 డిగ్రీలకు పడిపోయింది. దీపావళి రోజున అది మరింత తగ్గి 14.9 డిగ్రీలుగా నమోదైంది.
ప్రతి ఏటా నవంబర్ రెండో వారంలో చలి తీవ్రత పెరుగుతుంది. కానీ ఈసారి అక్టోబరు మూడో వారం నుంచి చలితీవ్రత పెరగడం మొదలవ్వడంతో.. ప్రజలు వణుకుతున్నారు. రాజేంద్ర నగర్లో అత్యల్పంగా 13.8 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వికారాబాద్ జిల్లా బంట్వారంలో ఆదివారం 10.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో 13.3 డిగ్రీలు నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నా పగలు మాత్రం 30 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి.
కాగా.. ఉష్ణోగ్రతలు పడిపోయినంతమాత్రాన శీతాకాలం మొదలైనట్టు కాదని వాతావరణశాఖ చెప్తోంది. ఈశాన్య, పశ్చిమ దిశల నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగానే రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్టు తెలిపింది. గాలుల ప్రభావం తగ్గితే ఉష్ణోగ్రతలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించింది.
Next Story