ఫలక్ నుమా ప్రమాదానికి.. బెదిరింపు లేఖకు ఏంటి సంబంధం?
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైళ్లో
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైళ్లో మంటలు చెలరేగాయి. వరుసగా మూడు ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్తో రైళ్లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో.. కొద్దిరోజుల కిందట రైల్వే శాఖకు ఓ వ్యక్తి రాసిన బెదిరింపు లేఖ రాసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వే సీపీఆర్ఓ రాకేష్ స్పందిస్తూ.. ఆగంతుకుడి బెదిరింపు లేఖకు, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆగంతుకుడి లేఖపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనలో 3 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహెచ్ఈఎల్కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. జూన్ 30వ తేదీన దక్షిణ మధ్య రైల్వే శాఖకు బెదిరింపు లేఖ అందింది. ఒడిశాలోని బాలాసోర్ తరహాలో ఢిల్లీ- హైదరాబాద్ రూట్లో రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించారు.