Sun Dec 22 2024 08:28:46 GMT+0000 (Coordinated Universal Time)
U.S. Consulate Jobs : పర్మినెంట్ ఉద్యోగం.. లక్షల జీతం.. వారానికి నలభై గంటల పని
హైదరాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేందుకు తాపీమేస్త్రీ ఉద్యోగం కోసం వెలువడిన నోటిఫికేషన్ నెట్టింట వైరల్ అయింది
తాపీ మేస్త్రీ ఉద్యోగమంటే.. నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఉంటుంది. రోజువారీగా కూడా కూలీ ఇస్తారు. రోజు వారీ కూలీ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకూ ఇస్తారు. కానీ యూఎస్ కాన్సులేట్ లో తాపీమేస్త్రీ ఉద్యోగానికి భారీ వేతనంతో నోటిఫికేషన్ విడుదలయింది. తాపీ మేస్త్రీకి ఇంత వేతనమా? అంటూ ముక్కున వేలేసుకున్న వారు ఉన్నారు. కానీ కష్టంతో కూడుకున్న పని కావడం, అది కూడా యుఎస్ కాన్సులేట్ కావడంతో అంత స్థాయిలో జీతం ఇస్తూ నోటిఫికేషన్ విడుదలయింది.
పర్మినెంట్ పోస్టు...
హైదరాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేందుకు తాపీమేస్త్రీ ఉద్యోగం కోసం వెలువడిన నోటిఫికేషన్ లో జీతం ఏడాదికి 4,47,348 రూపాయలుగా నిర్ణయించారు. అంటే నెలకు 37,279 రూపాయలు వేతనాన్ని ఈ ఉద్యోగికి చెల్లిస్తారు. వేతనంతో పాటు అదనపు సౌకర్యాలు, ప్రయోజనాలు కూడా దక్కుతాయి. పూర్తికాలం పనిచేసే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల విడుదలయిన నోటిఫికేషన్ చూసి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ఆశ్చర్యపోయారు.
పనిగంటలు...
తాపీ మేస్త్రీ పని అయినా నేర్చుకోకపోతిమి కదా? అన్న బాధపడ్డవారు కోకొల్లలు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్థాయిలో వేతనంతో పాటు సౌకర్యాలు లభిస్తున్నాయని తెలియడంతో ఆ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పర్మినెంట్ పోస్టు కావడంతో పాటు వారానికి కేవలం నలభై గంటలు మాత్రమే పనిచేయాలని పేర్కొనడం మరింత ఆసక్తికరం. అంటే రోజుకు ఐదారు గంటలకు మించి పని చేయాల్సిన పనిలేదు. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత, సర్టిఫికేట్లు చూసిన తర్వాత నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
రెండేళ్ల అనుభవం...
ఇందులో అర్హత కూడా పెద్దగా లేదు. రెండేళ్ల అనుభవం ఉంటే చాలు. గోడలు నిర్మించడంతో పాటు కాంక్రీట్ తో సహా తాపీ పనులు చేయాల్సి ఉంటుంది. ఇటుకలతో గోడ నిర్మాణం, ఫ్లోరింగ్ పనులు చేయడం, హాలో బ్రిక్స్ తో నిర్మాణాలను చేపట్టడం వంటి వాటిలో అనుభవం ఉంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన మెటీరియల్ మార్కెట్ లో ఎంత ధరకు అందుబాటులో ఉంటుంది కూడా తెలియాల్సి ఉంటుంది. అంచనాలు రూపొందించడానికి అది ఉపయోగకరమని యూఎస్ కాన్సులేట్ భావించింది. ఈ నెల 25వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలని, ఎనిమిదో తరగతి పూర్తి చేసి, ఆంగ్ల భాషను అర్థం చేసుకుంటే చాలు అని యూఎస్ కాన్సులేట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.
హెల్పర్ పోస్టు కూడా..
అంతేకాదు హిందీ, తెలుగు భాషల్లో నైపుణ్యాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే ఎంపిక చేస్తారు. అనంతరం మెడికల్ టెస్ట్‌లోనూ పాస్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు హెల్పర్ ఉద్యోగం కూడా ఉంది. హెల్పర్ ఉద్యోగానికి ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. హెల్పర్ కు ఏడాదికి 3,84,265 రూపాయల వేతనంగా నిర్ణయించారు. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే సరిపోతుంది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, కార్పెంటరీ వంటి పనుల్లో అనుభవం ఉంటే చాలని పేర్కొంది. వీరికి యూఎస్ కాన్సులేట్ లో పనిచేసే ఉద్యోగులకు వర్తించే అన్ని ప్రయోజనాలను కల్పించనున్నారు.
Next Story