Mon Dec 23 2024 02:06:23 GMT+0000 (Coordinated Universal Time)
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 43 అడుగులకు నది నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో ఇప్పటికే పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాద్రి రామయ్య ఆలయ పరిసరాల్లోనూ కుండపోత వర్షాలకు నీరు చేరడంతో.. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అన్నదాన సత్రం వద్ద వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరికి వరద పోటెత్తిన నేపథ్యంలో.. జిల్లా కలెక్ట్ ప్రియాంక ఎప్పటికప్పుడు పరిసర గ్రామాల పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా.. కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయాలు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ప్రాణహాని జరగకుండా తగు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. జాలర్లు నదిలో చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న రహదారులపై ప్రయాణించవద్దని హెచ్చరించారు.
Next Story