Mon Nov 18 2024 23:25:06 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో 9కి చేరిన ఒమిక్రాన్ కేసులు
రోజురోజుకూ తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్ పెరిగిపోతోంది. తెలంగాణలో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి
రోజురోజుకూ తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్ పెరిగిపోతోంది. తొలుత ఒకరిద్దరికి ఒమిక్రాన్ సోకిందని సర్వత్రా అనుమానాలు రాగా.. ఆ తర్వాత నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండ్రోజుల క్రితమే వరుసగా ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించడంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఆ సంఖ్య 9కి చేరింది. ఇటీవల యూకే నుంచి హన్మకొండ వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరినట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కానీ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని సూచించారు.
లక్షణాలు మాత్రం...
విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఒమిక్రాన్ బారిన పడిన 9 మందిలో ఇప్పటివరకూ ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. పైగా యూకే లో తప్ప మరే ఇతర దేశంలోనూ ఒమిక్రాన్ మరణం సంభవించలేదని తెలిపారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 76, 764 మందిని స్క్రీన్ చేయడం జరిగిందన్న ఆయన.. ఈ వైరస్ 50 రకాలుగా మ్యూటెంట్లుగా మారినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నారు. రెండ్రోజులుగా నగరంలో ఒమిక్రాన్ హాట్ స్పార్ట్ లుగా గుర్తించిన ఏరియాల్లో 600 మందికి నిర్థారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్, ఒమిక్రాన్ వచ్చినవారు ఐసోలేషన్ లో ఉండి చికిత్సలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంకా 1,2 డోసుల వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే వేయించుకోవాలని సూచించారు
Next Story