Thu Apr 10 2025 10:34:43 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అర్హులందరికీ పథకాలన్నారు.. గ్రౌండ్ లో రియాలిటీ ఎలా ఉందంటే?
జనవరి 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా పలు పథకాలను ప్రారంభించింది

జనవరి 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా పలు పథకాలను ప్రారంభించింది. అయితే ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయితే రైతు భరోసా నిధులు కొంత వరకూ జమ అయ్యాయి. నిబంధనల మేరకు రైతుల ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది. అర్హత ఉన్న వారికి అందరికీ విడతల వారీగా ఈ పథకం కింద నిధులను జమ చేస్తుంది. ఎకరాతో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ప్రస్తుతం ఐదు ఎకరాలున్న రైతులకు భరోసా నిధులను విడుదలచేసే ప్రక్రియను ప్రారంభించినట్లు చెబుతున్నారు. తమ ఖాతాల్లో నిధులు జమ కాకుంటే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
నిధులు జమ కాక...
ఇక ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తయింది. గ్రామ సభల ద్వారా ఈ పథకం కింద ఎంపిక చేశారు. అయితే తొలి విడతలో ఇప్పటికి కొందరికి మాత్రమే నిధులు జమ అయినట్లు చెబుతున్నారు. నియోజకవర్గానికి 3,750 ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో పదో వంతు మందికి కూడా నిధులు విడుదల చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా సొంత స్థలం ఉన్నవారినే ఈ పథకం కింద ఎంపిక చేశారు. అయితే ఇళ్లు మంజూరయిన వారికి విడతల వారీగా ఐదు లక్షల రూపాయల నగదును జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కొన్ని నియోజకవర్గాల్లో మోడల్ హౌస్ లను నిర్మించినా అసలు అనేక చోట్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదంటున్నారు. ఈ నెలాఖరులోగా లక్ష రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.
కొత్త రేషన్ కార్డులు రాక...
మరొక ప్రధానమైన అంశం రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డులు అర్హత ఉన్నవారికి ఎవరికైనా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గ్రామసభల్లో అనేక మంది అధికారులతో వీటి కోసం వాగ్వాదానికి కూడా దిగారు. దీంతో మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. ఈలోపు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కోడ్ అమలులోలేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదంటున్నారు. అనేక మంది రేషన్ కార్డుల కోసం ఇప్పటికీ ఎదురు చూపులు చూస్తున్నారు. అధికారులు చేస్తున్న నిర్వాకం కారణంగా ప్రభుత్వానికి రేషన్ కార్డుల విషయంలో చెడ్డపేరు వచ్చేలా కనిపిస్తుంది.
Next Story