Fri Dec 20 2024 03:41:54 GMT+0000 (Coordinated Universal Time)
నిజాం రాజు తలవంచిన రోజు..
అది పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దినం.. సొంతగడ్డపైనే పరాయివారిగా బతుకులీడుస్తున్న ప్రజలు..
అది పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దినం.. సొంతగడ్డపైనే పరాయివారిగా బతుకులీడుస్తున్న ప్రజలు జరిపిన యుద్ధం.. భూస్వాముల దౌర్జన్యాలు, నిజాం రాజరిక దుర్మార్గ వ్యవస్థ, రజాకర్ల అమానుషాలు.. తెలంగాణను అణువణువునా పట్టిపీడించిన అన్ని దుర్మార్గాల నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందడానికి జరిగిన మహా సంగ్రామమది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థాన విలీనం చరిత్రాత్మకమైన ఉదంతం.. నిజాం నవాబు తోకముడిచి భారత్‌కు లొంగిపోయిన సందర్భం.. అసలు సెప్టెంబర్ 17న ఏం జరిగింది? హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా విలీనమైంది?
ఏ ఉద్యమమైనా అణచివేత నుంచి మొదలవుతుంది. బూర్జువా వ్యవస్థలు, భూస్వాముల దోపిడీని, దొరల పెత్తందారీ పోకడలను ఎదిరించి పుడుతుంది.. తెలంగాణ సాయుధ పోరాటం కూడా అలాంటిదే.. భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడితే.. ప్రత్యేక సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం నిజాం నవాబుల దాష్టీకాన్ని, రజాకర్ల దురాగతాలను ఎదిరించి పోరాడింది. తెలంగాణ అంటేనే ఉద్యమం. ఈ ఉద్యమ గోస ఈనాటిది కాదు.. నాడు నైజాం నవాబును తరిమి కొట్టడానికి ఏకంగా సాయుధ పోరాటమే చేసిన చరిత్ర కలిగిన ప్రాంతమిది. భారతదేశం మొత్తం బ్రిటీష్ వారి ఆధీనం నుంచి విడివడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించుకున్నా తెలంగాణ ప్రాంతానికి మాత్రం అప్పట్లో విమోచన కలగలేదు. నైజాం పాలకుల దాష్టీకం నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొందడానికి 1951 వరకూ ఉద్యమాలు జరిగాయి. విద్యార్ధులు, యువకులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు ఇలా సమాజంలో భాగస్వాములైన అన్ని వర్గాలు ఈ ఉద్యమంలో మమేకమైపోయారు. అడుగులో అడుగేశారు.
ప్రజలపై చేసిన దారుణాలు ఎన్నో..
నిజాం నవాబు రజాకార్ల అండతో హైదరాబాద్‌ను తెలంగాణను ఏలినప్పుడు ప్రజలపై జరిపిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.. భూస్వాముల ఆగడాలు, పెత్తందారీ పోకడలను అన్నింటినీ భరించింది తెలంగాణ గడ్డ.. సత్యాగ్రహాల నుంచి సాయుధ పోరాటం వరకూ తెలంగాణ పోరాట గతిలో ఎన్నెన్నో ఆయుధాలు. మరెన్నో అస్త్రాలు.. మట్టి మనుషుల నుంచి మహావీరుల వరకూ అందరూ కదలి వచ్చారు.. నిరుపేద సైతం పెత్తందారీ పోకడలపై పోరుసల్పి మహావీరుడయ్యాడు. సామాన్య మానవులు, తమ అసాధారణమైన పోరాటగతితో మహానాయకులుగా రూపొందారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమించారు. లెక్కలేనన్ని త్యాగాలు చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. భారత జాతీయోద్యమంలోనే ఒక విలక్షణమైన ఉద్యమంగా తెలంగాణ సాయుధ పోరాటం కీర్తి పొందింది.
నిర్భంధాలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. నాయకులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. పిల్లా, పాపలనుంచి, మహిళలు, వృద్ధుల వరకూ చేతికి దొరికిన ఆయుధంతో శత్రువులను చీల్చి చెండాడారు. అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారు. నిజాం మిలటరీని, రజాకార్ మూకలను మట్టి కరిపించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 13 నెలలకు ఈ చీకటి సంస్థానానికి విమోచనం దొరికింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యం హైదరాబాద్ సంస్థానం.. నిజాం రాజుల పాలన కింద ఉన్న ఆ రాజ్యాన్ని భారత పాలకులు సైనిక చర్య ద్వారా 1948లో సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసుకున్నారు. దీనికోసం అయిదురోజులు, వందగంటల పాటూ యుద్ధం జరిగింది. నిజాం రాజు లొంగిపోయాడు.. ఇండియన్ యూనియన్ చేతుల్లో అధికారాన్ని అప్పగించాడు..
హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్యను చేపట్టింది అప్పటి సర్కార్. హైదరాబాద్‌ను భారతదేశం తన సైన్యంతో అష్ట దిగ్బంధనం చేసేసింది. నిజాం చెర నుంచి విముక్తి పరచడానికి భారత సైన్యాలు నిజాం సైన్యంతో భీకరంగా పోరాడాయి. లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్ మహారాజ్ రాజేంద్రసింగ్ సారధ్యంలో మేజర్ జనరల్ డి.ఎస్. బ్రార్ ముంబై సెక్టార్ నుంచి ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర మద్రాస్ సెక్టర్ నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ సెక్టార్ నుంచి తన సేనలతో హైదరాబాద్ సంస్థానాన్ని దిగ్బంధించారు.
అప్పటి భారత వైమానిక దళ ఎయిర్ వైస్ మార్షల్ ముఖర్జీ సైతం రంగంలోకి దిగారు. భారత సైన్యం క్రమ క్రమంగా నిజాం కోటలను ఛేదించుకుంటూ ముందుకు సాగాయి. వివిధ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ హైదరాబాద్ దిశగా పయనించాయి. నిజాం సైన్యంపై భారత సైన్యం బాంబులు కురిపిస్తూ వారిని కకావికలు చేసింది. చివరకు నిజాం సైన్యాధికారి ఎడ్రూస్ చేతులెత్తేశాడు. దీంతో నిజాం నవాబు ఓటమిని అంగీకరించి17వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో భారత సైన్యానికి స్వాగతం పలికారు. అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సాదరంగా ఆహ్వానించి చేతులు జోడించి వంగి నమస్కరించాడు. అనంతరం హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనమైంది.
Next Story