Sun Dec 22 2024 19:19:45 GMT+0000 (Coordinated Universal Time)
Jeevan Reddy : పెద్దోళ్లతో కాస్త మాట్లాడుతుండండయ్యా... ఏకపక్ష నిర్ణయాలైతే ఇబ్బందులు తప్పవు భయ్యా?
అత్యుత్సాహం అన్ని విషయాల్లో పనికి రాదు. అదీ రాజకీయాల్లో అస్సలు వర్క్ అవుట్ కావు.
అవును.. అత్యుత్సాహం అన్ని విషయాల్లో పనికి రాదు. అదీ రాజకీయాల్లో అస్సలు వర్క్ అవుట్ కావు. అన్నీ రోజులు మనవి కావు. అలాగే నాయకత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ఒక్కసారి బూమ్రాంగ్ అవుతాయి. తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ కు కొద్దితేడాతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతుంది. అందులో తప్పుపట్టడానికి ఏమీలేదు. ఎందుకంటే గత పదేళ్లలో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన అనేక మందిని తమ పార్టీలో చేర్చుకుని కేసీఆర్ నాడు వికటాట్టహాసమే చేశారు. తనకు ఎదురు లేదని భావించారు. తిరుగులేదని భ్రమపడ్డారు. కాంగ్రెస్, కమ్మునిస్టులు, టీడీపీ ఇలా ఒక్కటేమిటి అన్ని పార్టీల నుంచి కేసీఆర్ తన పార్టీలోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ నాడు చేర్చుకుని...
ఏకంగా 2014 23 మందిని, 2018 లో 18 మందిని తన పార్టీలో చేర్చుకున్నారు. పదిహేను మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని తన పార్టీ కండువా కప్పేశారు. అయినా వారిపై అనర్హత వేటు పడలేదు. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నాడు కేసీఆర్ చేసిన తప్పులే నేడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. ఇప్పుడు అదే దెబ్బ కేసీఆర్ కు తగులుతుంది. ఆ పెయిన్ ఏంటో ఇప్పుడు తెలిసి వస్తుంది. తాను బీఫారాలు ఇస్తేనే గెలిచిన నేతలు తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా పోవడం బాధ కలిగిస్తుంది.
ఆయనంటే అక్కడ మోనార్క్...
అయితే బీఆర్ఎస్ వేరు. ఆపార్టీలో కేసీఆర్ మోనార్క్. ఆయన నిర్ణయమే ఫైనల్. ఎవరూ నోరు మెదిపేందుకు కూడా అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ అలా కాదు. ప్రజాస్వామ్యం ఎక్కువ. అదీ సీనియర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. దశాబ్దాల తరబడి పార్టీ జెండాను పట్టుకుని ఉన్న నేతలు అనేక మంది ఉన్నారు. వారిని ఒప్పించి.. మెప్పించి.. అవసరమైతే నచ్చచెప్పి ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకోవడం నాయకత్వానికి మంచిది. లేకుంటే అనవసరం తలనొప్పులు మొదలవుతాయి. పార్టీని బలోపేతం చేద్దామని ఏకపక్షంగా, ఎవరికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటే ఒక్కోసారి ఇబ్బందులు తప్పవు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ లో ఏకవ్యక్తి పాలన ఉండదు. అందులేనేతలు ఎక్కువ. నోళ్లు ఎక్కువే. తమను కాదని తమ నియోజకవర్గంలో వేలుపెడితే అస్సలు ఊరుకోరు.
రాజీనామాకు సిద్ధమయిన...
తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను జీవన్ రెడ్డికి తెలియకుండా తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడ వరకూ వెళ్లారంటే పార్టీకి రాజీనామా చేస్తానంతగా. 2014 ఎన్నికల నుంచి మూడు ార్లు జీవన్ రెడ్డిపై పోటీ చేసిన వ్యక్తినే తనకు తెలియకుండా పార్టీలోకి తీసుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన అసంతృప్తి లెవెల్స్ ను గుర్తించిన పార్టీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నిస్తున్నారు. అయినా జీవన్ రెడ్డి మాత్రం తాను రాజీనామా చేస్తానని చేస్తున్న హెచ్చరికలతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను బుజ్జగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జీవన్ రెడ్ి నివాసానికి చేరుకుని ఆయనకు పరిస్థితిని వివరిస్తున్నారు. బుజ్జగిస్తున్నారు. మరి ఆయన దిగివస్తారా? లేదా? అన్నది కాలమే తేల్చనుంది. అందుకే గిల్లి జోలపాడటం అంటే ఇదే నంటూ జీవన్ రెడ్డి అనుచరులు నాయకత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story